టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ శుభారంభం అందుకోలేకపోయింది. పసికూన అమెరికా చేతిలో చిత్తయ్యింది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా అనవసర తప్పిదాలతో పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమి పాకిస్థాన్ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది.
గ్రూప్-ఏలో భారత్, యూఎస్‌ఏ, కెనడా, ఐర్లాండ్‌తో ఉన్న పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఓటమితో డేంజర్ జోన్‌లో నిలిచింది. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌లో భారత్‌తో తలపడనుంది. ఆదివారం జరగనున్న ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడం ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.

డేంజర్ జోన్‌లో పాక్..
ఈ టోర్నీలో పాకిస్థాన్ ముందడుగు వేయాలంటే భారత్‌పై విజయం సాధించడం తప్పనిసరి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా.. వర్షం కారణంగా రద్దయినా పాకిస్థాన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆతిథ్య అమెరికా వరుసగా కెనడా, పాకిస్థాన్ జట్లను ఓడించి నాలుగు పాయింట్స్‌తో ప్రస్తుతం గ్రూప్-ఏ టాపర్‌గా కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై గెలిచిన భారత్ రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
అగ్రస్థానంలో ఉన్న అమెరికా తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భారత్, ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా అమెరికా ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి.
అమెరికాతో పోటీ..
మరోవైపు పాకిస్థాన్.. భారత్ చేతిలో ఓడి ఐర్లాండ్, కెనడాపై గెలిచినా 4 పాయింట్స్ వస్తాయి. అప్పుడు పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఒకవేళ పాకిస్థాన్ భారత్ చేతిలో ఓడి.. ఐర్లాండ్, కెనడాపై గెలిచి సూపర్-8 చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగతా జట్లు కూడా రెండేసి మ్యాచ్‌లు ఓడిపోవాలి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతోంది.
అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌కు అమెరికాతోనే పోలీ నెలకొంది. ఇక పాకిస్థాన్‌ను ఓడించిన అమెరికాకు ఐర్లాండ్‌ను ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా సొంతగడ్డపై ఈ టోర్నీ జరుగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు పాకిస్థాన్ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో బలహీనంగా కనిపిస్తోంది.
భారత్ చేతిలో ఓడితే..
ఈ చికాకులు ఏం లేకుండా పాకిస్థాన్ సూపర్-8కు చేరాలంటే భారత్‌ను ఓడించాలి. అప్పుడే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్ టోర్నీలో ముందడుగు వేస్తోంది. పసికూన చేతిలో ఓడి పుంజుకోవడం పాకిస్థాన్‌కు కొత్త కాదు. గత టీ20 ప్రపంచకప్ 2024లో పాక్ జింబాబ్వేతో ఓడింది. ఆ తర్వాత సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.