'సౌరభ్ నేత్రావల్కర్'.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ భారత సంతతి అమెరికా పేసర్.. తమ జట్టు సూపర్ 8 చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తన సూపర్బ్ బౌలింగ్‌తో పటిష్టమైన పాకిస్థాన్‌ను మట్టికరిపించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పెవిలియన్ చేర్చాడు.
భారత్‌కు చెందిన సౌరభ్ నరేశ్ నేత్రావల్కర్ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ముంబైకి చెందిన అతను 1991 అక్టోబర్ 16న జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకున్న అతను ఈ ఆటనే కెరీర్‌గా ఎంచుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అండర్ 19 ప్రపంచకప్ 2010లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుత టీమిండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, సందీప్ శర్మలతో కలిసి సౌరభ్ ఆడాడు. ఆ టోర్నీ అనంతరం ముంబై తరఫున రంజీ క్రికెట్ కూడా ఆడాడు. తీవ్రమైన పోటీ కారణంగా అతనికి సరైన అవకాశాలు రాలేదు.
దాంతో చదువుపై ఫోకస్ పెట్టిన అతను 23 ఏళ్ల వయసులో మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. అయినా ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయిన అతను.. అక్కడి స్థానిక టోర్నీలు ఆడి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సౌరభ్.. యూఏఈతో తొలి మ్యాచ్ ఆడాడు. అమెరికాకు సారథ్యం కూడా వహించాడు. ఇప్పటి వరకు ఆ జట్టు తరఫున 48 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం అతను ఒరాకిల్ కంపెనీలో ఏఐ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మ్యాచ్‌లు పూర్తయిన అనంతరం హోటల్ రూమ్‌లోకి వచ్చి సౌరభ్ తన వర్క్ పూర్తి చేస్తున్నాడని అతని సోదరి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
తాజాగా ఒరాకిల్ కంపెనీ సైతం తమ ఉద్యోగి ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేసింది. 'మా ఏఐ ఇంజనీర్, క్రికెట్ స్టార్ సౌరభ్ నేత్రవల్కర్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 చేరి అమెరికా చరిత్ర సృష్టించింది.'అని ఒరాకిల్ సంస్థ ఎక్స్‌వేదికగా కొనియాడింది. ఈ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలిపిన సౌరభ్ నేత్రవల్కర్.. ఇది ఆరంభం మాత్రమేనని, ఒకే జట్టు ఒకే లక్ష్యమని బదులిచ్చాడు.
ఈ పోస్ట్‌పై భారత నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సౌరభ్ నేత్రవల్కర్ జీతాన్ని 60 శాతం పెంచాలని ఒకరంటే.. టార్గెట్స్ ఏం ఇవ్వకుండా స్వేచ్చగా క్రికెట్ ఆడేలా అనుమతి ఇవ్వాలని మరొకరు కామెంట్ చేశారు. ఇక అతనికి లీవ్స్ పెంచాలని, వర్క్ ఇవ్వద్దని ఇంకొకరు రిక్వెస్ట్ చేశారు. ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా ఇవ్వాలని మరొకరు డిమాండ్ చేశారు.