క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆదివారం(జూన్ 9) జరగాల్సిన హైఓల్టేజ్ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. AccuWeather వివరాల ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ జరిగే న్యూయార్క్‌లో ఉదయం 51 శాతం వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సాయంత్రం వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గనుందని సమాచారం. అయితే మ్యాచ్ పూర్తి చేయడానికి అంపైర్లకు చాలా సమయం ఉండనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైనా.. అమెరికాలో ఈ మ్యాచ్ డే గేమ్‌గా జరగనుంది. కాబట్టి వర్షం ఆగే వరకు వేచి చూసి మ్యాచ్‌ను నిర్వహించడానికి ఆస్కారం ఉంది.

ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఇక అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు భారత్‌తో పోరు అగ్ని పరీక్షనే. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాకిస్థాన్ టోర్నీలో ముందడుగు వేయగలదు. భారత్‌తో మ్యాచ్ జరగకుండా వర్షంతో రద్దయితే పాకిస్థాన్ సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. కెనడా, ఐర్లాండ్‌తో గెలిచినా పాక్ ఖాతాలో 5 పాయింట్సే ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఐర్లాండ్‌పై భారీ విజయం సాధించిన టీమిండియా.. పాక్‌తో మ్యాచ్ రద్దయినా కెనడా, అమెరికా జట్లను ఓడిస్తే సూపర్-8కు అర్హత సాధిస్తోంది. పాక్, కెనడాపై గెలిచిన అమెరికా.. ఐర్లాండ్‌ను ఓడిస్తే 6 పాయింట్స్‌తో సూపర్8 రేసులో నిలుస్తోంది.
గత టీ20 ప్రపంచకప్ 2022లోనూ పాకిస్థాన్.. జింబాబ్వే చేతిలో ఓడి బౌన్స్ బ్యాక్ అయ్యింది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్నది. భారత్ తమ లీగ్ మ్యాచ్‌లను పాకిస్థాన్‌తో ఆదివారం, అమెరికాతో జూన్ 12, కెనడాతో జూన్ 15న ఆడనుంది.
లీగ్ స్టేజీల్లో నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధించనున్నాయి. సూపర్-8లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో తలపడున్నాయి. జూన్ 29న వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.