టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందు టీమిండియా అదిరిపోయే విజయాన్నందుకుంది. మెగా టోర్నీ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన వామప్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది.
రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(18 బంతుల్లో 4 ఫోర్లతో 31) మెరుపులు మెరిపించారు.

ఘోర రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జెర్సీని ధరించిన పంత్.. మునపటిలా స్వేచ్చగా చెలరేగాడు. ఈ సన్నాహక మ్యాచ్‌లో సంజూ శాంసన్(1), రోహిత్ శర్మ(23), శివమ్ దూబే(14) నిరాశపరిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, మహ్ముదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ తీసారు.
రఫ్ఫాడించిన అర్ష్‌దీప్ సింగ్
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులే చేసి ఓటమిపాలైంది. అర్ష్‌దీప్ సింగ్(2/12), శివమ్ దూబే(2/10) నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మహ్మదుల్లా(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 40 రిటైర్డ్ ఔట్), షకీబ్ అల్ హసన్( 340 బంతుల్లో 2 ఫోర్లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(1/17), హార్దిక్ పాండ్యా(1/30), అక్షర్ పటేల్(1/10), జస్‌ప్రీత్ బుమ్రా(1/12) సత్తా చాటార.
చెలరేగిన భారత బౌలర్లు..
అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే సౌమ్య సర్కార్(0) ఔటవ్వగా.. అతని మరుసటి ఓవర్‌లో లిటన్ దాస్(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే నజ్ముల్ హొస్సెన్ షాంటో(0)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆచితూచి ఆడిన టన్‌జిద్ హసన్(17)ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో 41 పరుగులకే బంగ్లా 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో షకీబ్ అల్ హసన్, మహ్ముదుల్లా జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. షకీబ్ అల్ హసన్‌ను బుమ్రా ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన మహ్ముదల్లా రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. శివమ్ దూబే వేసిన ఆఖరి ఓవర్‌లో రిషద్ హొస్సేన్, జాకెర్ అలీ ఔటవ్వడంతో భారత విజయం లాంఛనమైంది.
కోహ్లీ దూరం..
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. శనివారం ఉదయమే జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీకి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ విరాట్ కోహ్లీ మైదానానికి వచ్చి.. డగౌట్ నుంచి ఈ వామప్ మ్యాచ్‌ను వీక్షించాడు.