టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరింది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు అజేయంగా ఫైనల్ చేరాయి. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమిపాలవ్వలేదు.
టైటిలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచకప్ చరిత్రలోనే సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్ చేరింది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి తమ జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ అందించాలని భావిస్తోంది. మరోవైపు టీమిండియా గత 11 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం టీమిండియా నాకౌట్ దశకే పరిమితమైంది. ఈ క్రమంలోనే టైటిల్ గెలిచి 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఉవ్విళ్లూరుతోంది.

టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ రూ. 20.42 కోట్లు(2.45 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీగా ఇవ్వనుంది. రన్నరప్ జట్టుకు రూ. 10.67 కోట్లు క్యాష్ రివార్డ్‌గా దక్కనుంది.
సెమీఫైనల్లో ఓటమిపాలైన ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్లకు చెరో రూ. 6.56 కోట్లు క్యాష్ రివార్డ్‌గా దక్కనుంది. ఈ టోర్నీలోని విజేతలతో పాటు పాల్గొన్న జట్లకు మొత్తం రూ. 93.80 కోట్ల రూపాయలను ఐసీసీ క్యాష్ రివార్డ్స్‌గా ఇవ్వనుంది.
సూపర్-8 చేరిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అమెరికా జట్లకు తలో రూ.3.18 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కనుంది. సూపర్-8కు అర్హత సాధించకుండా 9 నుంచి 12వ స్థానంలో నిలిచిన జట్లకు తలో రూ. 2.06 కోట్లు క్యాష్ రివార్డ్‌గా ఇవ్వనున్నారు. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచిన జట్లకు తలో రూ. 1.87 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కనుంది. ఈ టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లు లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు సాధించిన ప్రతీ విజయానికి రూ. 26 లక్షల చొప్పున క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నారు.