టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా జోరు కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో శనివారం ఏకపక్షంగా సాగిన సూపర్-8 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 50 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోకు కుల్దీప్ యాదవ్(3/19) సంచలన బౌలింగ్ తోడవ్వడంతో సునాయసంగా గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్(2/32), రిషద్ హొస్సేన్(2/43) రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది. నజ్ముల్ హొస్సేన్ షాంటో(32 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40), టన్జిద్ హసన్(31 బంతుల్లో 4 ఫోర్లతో 29), రిషద్ హొస్సేన్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 ) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/19) మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యాకు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
హార్దిక్ శుభారంభం..
197 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన లిటన్ దాస్(13)ను హార్దిక్ పాండ్యాతో కలిసి రోహిత్ శర్మ పెవిలియన్ చేర్చాడు. సూపర్ ప్లాన్‌తో దూకుడుగా ఆడుతున్న లిటన్ దాస్‌కు చెక్ పెట్టారు. క్రీజులోకి వచ్చిన నజ్ముల్ హెస్సెన్, తన్జిద్ హసన్ ఆచితూచి ఆడారు.
వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. తన్జిద్ హసన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
దెబ్బతీసిన కుల్దీప్ యాదవ్
ఆ వెంటనే టౌహిడ్ హృదయ్(4)ను ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్.. మరుసటి ఓవర్‌లో షకీబ్ అల్ హసన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన నజ్ముల్ హోస్సెన్‌ను బుమ్రా క్యాచ్ ఔట్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన జేకర్ అలీ,(1) రిషద్ హసన్ కూడా దారుణంగా విఫలమయ్యారు. రిషద్ హొస్సేన్(24)ను బుమ్రా ఔట్ చేయడంతో భారత విజయం లాంఛనమైంది.