టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ జరుగుతుండగా.. సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వచ్చిన సదరు అభిమాని హిట్ మ్యాన్‌ను హగ్ చేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.
అంతలోనే అప్రమత్తమైన పోలీసులు.. మైదానంలోకి దూసుకొచ్చి సదరు అభిమానిని నేలపై పడుకోబెట్టి చావాబాదారు. రోహిత్ శర్మ వద్దని చెబుతున్నా.. అమెరికా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు మ్యాచ్ నిర్వాహకుల్లోని ఒకరు వచ్చి రోహిత్ రిక్వెస్ట్‌ను పోలీసులకు తెలియజేయగా పైకి లేపి మైదానం బయటకు తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు అభిమానిని రక్షించేందుకు రోహిత్ శర్మ చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. అభిమానులకు రోహిత్ ఎప్పుడూ అండగా ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ సన్నాహక మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(18 బంతుల్లో 4 ఫోర్లతో 31) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, మహ్ముదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ తీసారు.అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులే చేసి ఓటమిపాలైంది.
బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 40 రిటైర్డ్ ఔట్), షకీబ్ అల్ హసన్( 340 బంతుల్లో 2 ఫోర్లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/12), శివమ్ దూబే(2/10) , మహమ్మద్ సిరాజ్(1/17), హార్దిక్ పాండ్యా(1/30), అక్షర్ పటేల్(1/10), జస్‌ప్రీత్ బుమ్రా(1/12) సత్తా చాటారు.