టీ20 ప్రపంచకప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్థాన్ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్.. సూపర్ -8 అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. తాజాగా ఇంగ్లండ్ కూడా అదే పరిస్థితి తెచ్చుకుంది. ఆస్ట్రేలియాతో శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 36 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగుల చేసింది. ట్రావిస్ హెడ్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), డేవిడ్ వార్నర్(16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39) రాణించారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమిపాలైంది. జోస్ బట్లర్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) రాణించినా ఫలితం లేకపోయింది. ఆడమ్ జంపా, కమిన్స్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఈ పరాజయంతో ఇంగ్లండ్ సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇంగ్లండ్ సూపర్ 8 చేరాలంటే..?
గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఓమన్‌లతో ఉన్న ఇంగ్లండ్.. తాజా పరాజయంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ గ్రూప్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన ఆస్ట్రేలియా 4 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం నమోదు చేయడంతో పాటు ఇంగ్లండ్‌తో మ్యాచ్ రద్దవ్వడంతో మూడు పాయింట్స్ సాధించిన స్కాట్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఓమన్‌పై గెలిచి, స్కాట్లాండ్ చేతిలో ఓడిన నమీబియా మూడో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన ఓమన్ చివరి స్థానంలో కొనసాగుతోంది.
స్కాట్లాండ్‌పైనే ఇంగ్లండ్ ఆశలు..
ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో నమీబియా, ఓమన్‌లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్ ఖాతాలో ఐదు పాయింట్స్ చేరుతాయి. స్కాంట్లాండ్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, నమీబియాలతో తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా ఆ జట్టు ఖాతాలో ఐదు పాయింట్స్ చేరుతాయి.
అప్పుడు రన్‌రేట్ కీలకం అవుతోంది. ప్రస్తుతం స్కాట్లాండ్‌కే మెరుగైన రన్ రేట్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ సూపర్ 8 చేరాలంటే తమ చివరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఒకవేళ స్కాట్లాండ్ సంచలన ప్రదర్శనతో ఆసీస్‌ను ఓడించడంతో పాటు నమీబియాపై గెలిస్తే ఏడు పాయింట్స్‌తో సూపర్ 8కు అర్హత సాధిస్తోంది.
ఇంగ్లండ్‌కు అలవాటే..
అప్పుడు ఐదు పాయింట్స్ సాధించినా ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే ఇలా ఆరంభంలో చతికిలపడి పుంజుకోవడం ఇంగ్లండ్‌కు కొత్త ఏం కాదు. గతంలోనూ చాలా సార్లు ఇంగ్లండ్ ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంకతో వరుసగా ఓటమిపాలైంది.
ఆ తర్వాత సంచలన ప్రదర్శనతో వరుస విజయాలు నమోదు చేసి ప్రపంచకప్‌ను ముద్దాడింది. గత టీ20 ప్రపంచకప్ 2022లోనూ ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో టైటిల్ సొంతం చేసుకుంది.