టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. గ్రూప్ దశలోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడి అతి కష్టం మీద టోర్నీలో ముందడుగు వేసిన ఇంగ్లండ్.. సూపర్-8లోనూ అదే తడబాటును కొనసాగిస్తోంది. వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. సౌతాఫ్రికా చేతిలో మాత్రం ఓటమిపాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ ( 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ మిల్లర్ ( 28 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (3/40) మూడు వికెట్లు తీయగా.. మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(37 బంతుల్లో 7 ఫోర్లతో 53), లియామ్ లివింగ్‌స్టోన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఈ పరాజయం ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, వెస్టిండీస్, అమెరికాలతో ఉంది. సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచి 4 పాయింట్స్‌తో టాప్‌లో ఉండగా.. వెస్టిండీస్ రెండింటిలో ఒకటి గెలిచి 1.814 రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లకు ఒకటి గెలిచి 0.412 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది.
టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లో ఇంగ్లండ్ తమ చివరి మ్యాచ్‌ను పసికూన అమెరికాతో ఆడనుంది. ఇంగ్లండ్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించాలి. ముందుగా బ్యాటింగ్ చేస్తే 160 ప్లస్ రన్స్ చేయడంతో పాటు 10 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఛేజింగ్‌కు దిగితే మాత్రం ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేయాలి.