ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు తెరపడింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
వన్డే ప్రపంచకప్ 2023 విజయానంతరం టెస్ట్, వన్డే ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన వార్నర్.. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటానని అప్పట్లో ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది. సూపర్-8 పోరులో అఫ్గానిస్థాన్, భారత్ చేతిలో ఓడిన ఆసీస్... సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ సంచలన విజయం సాధించి సెమీస్ చేరడంతో ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.దాంతో డేవిడ్ వార్నర్ కెరీర్‌కు ముగింపు పడినట్లు అయింది. తనకు ఎంతో ఇష్టమైన టీమిండియాతోనే అతను చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో 6 పరుగులే చేశాడు.
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 37 ఏళ్ల వార్నర్.. 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆస్ట్రేలియా తరఫున 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 110 టీ20లు ఆడి వరుసగా 8786, 6932, 3277 పరుగులు చేశాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా నాలుగు వికెట్లు పడగొట్టాడు. తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 2018 బాల్ టాంపారింగ్ వివాదం మాయని మచ్చగా నిలిచిపోయింది.
ఈ తప్పిదం కారణంగా వార్నర్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆసీస్ జట్టుకు సారథ్యం వహించలేకపోయాడు. ఇక వార్నర్.. ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడనున్నాడు. ఐపీఎల్‌తో పాటు పలు దేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో అభిమానులను అలరించనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం ఆడిన వార్నర్.. తెలుగు రాష్ట్రాల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
వార్నర్ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అతని భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు.