టీ20 ప్రపంచకప్ 2024లో సౌతాఫ్రికా.. ఘోర పరాజయాన్ని తప్పించుకుంది. పసికూన నెదర్లాండ్స్‌పై పోరాడి గెలిచింది. శనివారం ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ లో-స్కోరింగ్ థ్రిల్లర్‌లో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో ఓటమి నుంచి గట్టెక్కింది. డేవిడ్ మిల్లర్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటి సౌతాఫ్రికాకు ఓటమిని తప్పించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సైబ్రాండ్(45 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40), లోగన్ వాన్ బీక్(22 బంతుల్లో 3 ఫోర్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓట్‌నెలి బార్ట్‌మన్(4/11) నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. అన్రిచ్ నోకియా(2), మార్కో జాన్సెన్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 106 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ మిల్లర్( 59 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33) అసాధారణ ప్రదర్శనతో ఓటమిని తప్పించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వివియన్(2/12) లోగాన్ వాన్ బీక్(2/21) రెండు వికెట్లు తీయగా.. బాస్ డీ లీడే ఓ వికెట్ పడగొట్టాడు.
ఆదుకున్న మిల్లర్..
104 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), రీజా హెండ్రీక్స్(3), ఎయిడెన్ మార్క్‌రమ్(0) వరుసగా పెవిలియన్ చేరడంతో సౌతాఫ్రికా 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఎన్నో అంచనాలతో బ్యాటింగ్‌కు హెన్రీచ్ క్లాసెన్(4)కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.
దాంతో సౌతాఫ్రికా 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో ఈ మెగా టోర్నీలో మరో సంచలన ఫలితం నమోదవ్వనుందని అంతా అనుకున్నారు. కానీ డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ అసాధారణ ప్రదర్శనతో సౌతాఫ్రికాను ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ 65 పరుగులు జోడించారు. ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్ ఔటైనా.. డేవిడ్ మిల్లర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.