టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న గ్రూప్ డీ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేసారు. అన్రిచ్ నోకియా(4/7) నిప్పులు చెరగడంతో ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది.
నోకియాకు అండగా కగిసో రబడా(2/21), కేశవ్ మహరాజ్(2/22) రెండేసి వికెట్లు తీయగా.. ఓట్‌నీల్ బార్ట్‌మన్ ఓ వికెట్ పడగొట్టాడు. సఫారీ బౌలర్ల ధాటికి నలుగురు శ్రీలంక బ్యాటర్లు డకౌటయ్యారు. కుశాల్ మెండీస్(30 బంతుల్లో ఫోర్‌తో 19), ఏంజెలో మాథ్యూస్(16 బంతుల్లో 2 సిక్స్‌లతో 16), కామిందు మెండిస్(15 బంతుల్లో ఫోర్‌తో 11) రెండెంకల స్కోర్లు చేశారు.

కెప్టెన్ వానిందు హసరంగా(0), సదీర విక్రమార్క(0), మతీష పతీరణ(0), నువాన్ తుషారా(0) డకౌటవ్వగా.. పాతుమ్ నిస్సంక(3), చరిత్ అసలంక(6), డసన్ షనక(9), మహీష్ తీక్షణ(7 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆరంభం నుంచే సఫారీ బౌలర్లు నిప్పులు చెరగడంతో శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సఫారీ బౌలర్లు అందిపుచ్చుకున్నారు. పవర్ ప్లేలో ఆచితూచి ఆడిన శ్రీలంక వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. అనంతరం నొకియా రఫ్ఫాడించడంతో శ్రీలంక 10 ఓవర్లలో 5 వికెట్లకు 40 పరుగులే చేసింది. టీ20 క్రికెట్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.

డసన్ షనక, మాథ్యూ కాస్త పోరాడే ప్రయత్నం చేసినా.. రబడా దెబ్బతీసాడు. షనకను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నొకియా మరో రెండు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. కెప్టెన్ వానిందు హసరంగా తప్పిదంతో శ్రీలంక మూల్యం చెల్లించుకుంది. పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా రీడ్ చేయకుండా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం శ్రీలంక కొంపముంచింది.