వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000 ప్లస్ రన్స్, 50 ప్లస్ వికెట్స్ తీసిన రెండో వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో ఆదివారం ఉదయం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ 17 బంతుల్లో 6 ఫోర్లతో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసాడు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు 77 అంతర్జాతీయ టీ20లు ఆడిన రస్సెల్ 52 వికెట్లతో పాటు 1000 పరుగులు చేశాడు. రస్సెల్ కంటే ముందు డ్వేన్ బ్రావో వెస్టిండీస్ తరఫున 91 టీ20ల్లో 78 వికెట్లతో పాటు 1255 పరుగులు చేశాడు. మరే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రిస్ గేల్ రికార్డును అధిగమించేందుకు నికోలస్ పూరన్ 3 పరుగుల దూరంలో నిలిచాడు. ఉగాండతో 17 బంతుల్లో 22 పరుగులు చేసిన అతను 90 టీ20ల్లో 1897 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 79 టీ20ల్లో 1899 పరుగులు చేసి వెస్టిండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
పసికూన ఉగాండాపై వెస్టిండీస్ 134 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. జాన్సన్ ఛార్లెస్(42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), ఆండ్రీ రస్సెల్(17 బంతుల్లో 6 ఫోర్లతో 30 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఉగాండా బౌలర్లలో బ్రియన్ మసబా(2/31) రెండు వికెట్లు తీయగా.. రామ్‌జనీ, కోస్మాస్, దినేష్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అకీల్ హోస్సేన్(5/11) ఐదు వికెట్లతో ఉగాండా పతనాన్న శాసించాడు. అల్జారీ జోసెఫ్(2/6) రెండు వికెట్లు తీయగా.. రోమారియో షెఫర్డ్, గుడకేష్ మోతీ, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు.
ఈ గెలుపుతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా భారీ విజయాన్ని నమోదు చేసిన రెండో జట్టుగా వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ కన్నా ముందు శ్రీలంక 172 పరుగుల భారీ తేడాతో గెలిచి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో కెన్యాను ఓడించింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయంగా కొనసాగుతోంది. రెండో స్థానంలో వెస్టిండీస్ తాజా విజయం(134 పరుగుల భారీ తేడాతో) నిలిచింది.