టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ. 125 కోట్ల క్యాష్ రివార్డ్ అందజేసింది. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ గెలవడంతో బీసీసీఐ భారీ మొత్తంలో నగదు బహుమతిని ప్రకటించింది. ఈ క్యాష్ ప్రైజ్‌ను జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీ సభ్యులకు అందజేయనున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన ప్రధాన జట్టులోని 15 మంది సభ్యులతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రూ. 5 కోట్ల చొప్పున క్యాష్ రివార్డ్ అందనుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు రూ.2.5 కోట్ల చొప్పున ఇవ్వనుండగా.. టీమిండియా సహాయక సిబ్బందిలోని తొమ్మిది మందికి తలో రూ. 2 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో టీమిండియా ఫిజియోలు కూడా ఉన్నారు.

అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు తలో రూ.కోటి దక్కనుంది. అయితే టీ20 ప్రపంచకప్ ప్రధాన జట్టులో భాగంగా ఉండి ఒక్క మ్యాచ్ కూడా ఆడని ముగ్గురి ఆటగాళ్లకు రూ. కోట్ల చొప్పున క్యాష్ ప్రైజ్ దక్కనుంది.
యశస్వి జైస్వాల్..
టీమిండియా ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ బరిలోకి దిగడంతో యశస్వి జైస్వాల్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. టోర్నీ ఆసాంతం అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. వాటర్ బాయ్‌గా జట్టుకు సేవలు అందించాడు.
సంజూ శాంసన్..
వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా ఒక్క మ్యాచ్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్ రిషభ్ పంత్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగించింది.
యుజ్వేంద్ర చాహల్..
నాలుగో స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను జట్టులోకి తీసుకున్న టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వలేదు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను కొనసాగించిన టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించింది. దాంతో టోర్నీ మొత్తం యుజ్వేంద్ర చాహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వాటర్ భాయ్‌గా జట్టుకు సేవలు అందించాడు. మహమ్మద్ సిరాజ్ కూడా గ్రూప్ దశలోని మూడు మ్యాచ్‌లే ఆడాడు. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావడంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.