
హోబర్ట్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12కు జింబాబ్వే అర్హత సాధించింది. టోర్నీలో ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు అదరగొట్టింది. శుక్రవారం స్కాట్లాండ్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా మెగా టోర్నీలోకి ముందడుగు వేసింది. విజయం కోసం ఆఖరి వరకు పోరాడిన స్కాంట్లాండ్.. పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జార్జ్ మున్సీ(51 బంతుల్లో 7 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. కాలమ్ మాక్‌లియోడ్(25) ఫర్వాలేదనిపించాడు. అయితే ఆ జట్టులోధాటిగా ఆడే బ్యాటర్లు లేకపోవడంతో సాధారణ లక్ష్యానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక జింబాబ్వే బౌలర్లలో టెండై చతరా, రిచర్డ్ నగర్వా రెండేసి వికెట్లు తీయగా.. బ్రెస్సింగ్ ముజరబాని, సికందర్ రాజా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలోనే 5 వికెట్లకు 133 పరుగులు చేసింది. కెప్టెన్ క్రైగ్ ఎర్విన్(54 బంతుల్లో 6 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. సికందర్ రాజా(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) మెరుపులు మెరిపించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ వీల్, మార్క్ వాట్, మైకేల్ లీస్క్ తలో వికెట్ తీసారు.
క్వాలిఫయర్స్‌లో గ్రూప్ బిలో స్కాట్లాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్‌తో పోటీపడిన జింబాబ్వే,.. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. ఐర్లాండ్‌తో 31 పరుగులతో గెలుపొందిన జింబాబ్వే.. వెస్టిండీస్‌తో 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రేసులో నిలవాలంటే స్కాట్లాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి గ్రూప్ బి టాపర్‌గా సూపర్ 12కు దూసుకెళ్లింది. గ్రూప్ బి రన్నరప్‌గా మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన ఐర్లాండ్ క్వాలిఫై అయ్యింది. చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఆ జట్టు షాకిచ్చింది. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ అర్హత సాధించాయి. శనివారం నుంచి సూపర్ 12 షూరు కానుంది.