
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో సౌతాఫ్రికా చేతిలో ఖంగుతిన్న టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ చాలా చిన్న జట్టే అయినా.. ఏ మాత్రం లైట్ తీసుకోవడానికి అవకాశం లేదు. 2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా ఓడించినంత పనిచేసింది. ఈ క్రమంలోనే టీమిండియా అన్ని విధాలుగా సన్నదమవుతోంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ అభిమానులను అడిలైడ్ రికార్డ్స్ సంతోషపరుస్తున్నాయి. అడిలైడ్‌లో విరాట్ గత రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 9 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 13 ఇన్నింగ్స్‌ల్లో 843 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ 141. అడిలైడ్‌లో ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన విరాట్.. ఆ మ్యాచ్‌లో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ వేదికపై విరాట్ కోహ్లీ 84.30 సగటుతో పరుగులు చేశాడు. ఇక భారత్ నమోదు చేసిన అత్యంత చెత్త రికార్డు 36 పరుగులకు ఆలౌటైన మ్యాచ్‌లో విరాట్ చివరిసారిగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల వద్ద అజింక్య రహానేతో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ 4 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. అచ్చొచ్చిన అడిలైడ్‌లో మరోసారి చెలరేగుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం విరాట్‌కు అచ్చొచ్చిన మైదానమే అయినా జట్టుకు కలిసిరానిదని, 36 ఆలౌట్ ఇన్నింగ్స్ మళ్లీ రిపీట్ అయితే ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అసలే వర్షం ముప్పు ఉన్న ఈ మ్యాచ్‌లో ఫలితం తేడా కొడితే భారత్ తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి రావాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు. గ్రూప్-2లో 5 పాయింట్లతో సౌతాఫ్రికా టాప్‌లో ఉండగా.. భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ సైతం 4 పాయింట్లతో ఉన్నప్పటికీ రన్‌రేట్ కారణంగా మూడోస్థానానికే పరిమితమైంది. భారత్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్‌పై గెలవడంతో పాటు జింబాబ్వేను ఓడించాలి. ఈ రెండింటిలో ఒక్కటి ఓడినా.. వర్షంతో రద్దయినా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బంగ్లా మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకుంది.