
జీలాంగ్: టీ20 ప్రపంచకప్ 2022లో యూఏఈ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొన్నా.. విజయంతో సగర్వంగా నిష్క్రమించింది. మెగా టోర్నీ క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యూఏఈ 7 పరుగులతో గెలుపొందింది. అనామక జట్లే అయినా ఆటలో మాత్రం అగ్రశ్రేణి జట్లలా తలపడ్డాయి. బంతి బంతికి సమీకరణం మారగా.. అభిమానులకు ఉత్కంఠతో ఊపిరి సలపలేదు. చివరకు విజయం మాత్రం యూఏఈని వరించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ముహమ్మద్ వసీం(41 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ చుదంగపోయి రిజ్వాన్(43 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. చివర్లో బసిల్ హమీద్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) నాటౌట్ మెరుపులు మెరిపించాడు. నమీబియా బౌలర్లలో డేవిడ్, బెర్నార్డ్, బెన్ షికోంగో తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వైస్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), రుబెన్ ట్రంప్‌లెమన్(24 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 25 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. యూఏఈ బౌలర్లలో బసిల్ థంపి, జహూర్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. భారత సంతతి కార్తీక్ మెయప్పన్, ముహమ్మద్ వసీం, జునైద్ సిద్దిఖీ తలో వికెట్ తీసారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో నమీబియా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. చివరి ఓవర్లలో నమీబియా విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. మహమ్మద్ వసీం అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయడంతో పాటు 6 పరుగులే ఇచ్చాడు. దాంతో యూఏఈ విజయం లాంఛనమైంది.
క్వాలిఫయర్స్‌లో గ్రూప్-ఏలో ఉన్న యూఏఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటే విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. నమీబియా సైతం ఒక్క విజయమే సాధించడంతో సూపర్ 12కు క్వాలిఫై కాలేకపోయింది. శ్రీలంక, నెదర్లాండ్ జట్లు గ్రూప్ ఏ నుంచి సూపర్ 12కు అర్హత సాధించాయి. అక్టోబర్ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో సూపర్ 12కు తెరలేవనుంది.