
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు ఇంగ్లండ్ రూపంలో ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దాంతో ప్రపంచకప్ ముద్దాడలనే భారత ఆటగాళ్ల కల చెదిరింది. పేలవ బౌలింగ్, ఓపెనర్ల వైఫల్యం ఈ మ్యాచ్‌లో టీమిండియాను కొంపముంచాయి. ఈ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించినా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాపస్కోరర్‌గా నిలిచాడు. నాలుగు హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేసాడు. అయితే మెగా టోర్నీల్లో టీమిండియా బ్యాటర్లు టాప్ స్కోర్ చేయడమే శాపంగా మారింది.
ప్రపంచకప్ ఫైనల్ లేదా సెమీఫైనల్లో టీమిండియా వెనుదిరిగిన ప్రతీసారి భారత ఆటగాళ్లే టాప్ స్కోరర్‌గా ఉండటం విశేషం. ఇదే భారత జట్టుకు శాపంగా మారిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 1996 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడని, అప్పుడు శ్రీలంక చేతిలో టీమిండియా సెమీఫైనల్లో ఓడిందని గుర్తు చేస్తున్నారు. 2003 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రీపిట్ అయ్యిందని, సచిన్ టాప్ స్కోరర్ కాగా.. గంగూలీ సారథ్యంలోని భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిందని కామెంట్ చేస్తున్నారు.
2011 వన్డే ప్రపంచకప్‌లో మాత్రం సచిన్ సెకండ్ లీడింగ్ బ్యాటర్‌గా నిలిచాడని, దాంతో భారత్ టైటిల్ గెలిచిందని చెబుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలవగా.. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైందని గుర్తు చేస్తున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడని, అప్పుడు కూడా ఫైనల్లో పాక్ చేతిలో చుక్కెదురైందని చెబుతున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం గంభీర్ సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా ఉన్నాడని దాంతో టైటిల్ దక్కిందంటున్నారు.
2014, 2016, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడని, ఈ మూడు టోర్నీల్లో భారత్ టైటిల్ అందుకోలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన భారత్.. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడింది. తాజా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్నది.