
పెర్త్: టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా.. విజయంతో తమ పర్యటనను మొదలుపెట్టింది. మెగా టోర్నీ కోసం పెర్త్ వేదికగా సన్నదమవుతున్న రోహిత్ సేన.. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్మురేపింది. సమష్టిగా రాణించి ఈ వామప్ మ్యాచ్‌లో 13 పరుగులతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ తన జోరును కొనసాగించగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో మెరవగా.. దీపక్ హుడా(14 బంతుల్లో 22), దినేశ్ కార్తీక్(19 నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
అనంతరం వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో సామ్ ఫాన్నింగ్(59) హాఫ్ సెంచరీతో పోరాడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/6) మూడు వికెట్లతో సత్తా చాటగా.. యుజ్వేంద్ర చాహల్(2/15), భువనేశ్వర్ కుమార్(2/26) రెండేసి వికెట్లతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఉన్న ప్రధాన సానుకూలాంశం బౌలర్లు రాణించడమే. ముఖ్యంగా బలహీనంగా ఉన్న భారత జట్టు బౌలింగ్ విభాగానికి ఈ మ్యాచ్ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ(3) విఫలమవ్వగా హార్దిక్ పాండ్యా(20 బంతుల్లో 27) పర్వాలేదనిపించాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ సైతం ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో రిషభ్ పంత్(9) ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే అతను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. వెస్టర్న్ ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రండార్ఫ్, మాథ్యూ కెల్లీ, ఆండ్రూ టై వికెట్లు తీశారు. ఇదే జట్టుతో భారత్ మరో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రధాన జట్లతో భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో రోహిత్ సేన.. తమ ప్రపంచకప్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.