T20 World Cup 2022: కివీస్‌ను ఆదుకున్న గ్లేన్ ఫిలిప్స్.. లంక ముందు భారీ టార్గెట్!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్(64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104) సెంచరీతో చెలరేగాడు. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్‌ను విరోచిత శతకంతో ఆదుకున్నాడు. అతనికి తోడుగా డారిల్ మిచెల్(24 బంతుల్లో 22) నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో కాసున్ రజిత రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ, ధనంజయ డిసిల్వా, వానిందు హసరంగా, లాహిరు కుమారా తలో వికెట్ తీసారు. ఓ దశలో కివీస్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఆ జట్టు చెత్త ఫీల్డింగ్ కివీస్‌కు కలిసొచ్చింది.
ఆదిలోనే మూడు వికెట్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తీక్షణ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే ఫిన్ అలెన్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ డేవాన్ కాన్వే(4 బంతుల్లో 1), కేన్ విలియమ్సన్(8) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. డిసిల్వా బౌలింగ్‌లో కాన్వే క్లీన్ బౌల్డ్ అవ్వగా.. రజితా వేసిన ఇన్ స్వింగర్‌కు కేన్ మామ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో న్యూజిలాండ్ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. పవర్ ప్లేలో కివీస్ 3 వికెట్లకు 25 పరుగులు మాత్రమే చేసింది.
ఆదుకున్న ఫిలిప్స్..
హసరంగా వేసిన 7వ ఓవర్‌లో డారిల్ మిచెల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను పాతుమ్ నిస్సంక నేలపాలు చేశాడు. దాంతో ఈ అవకాశం అందుకున్న అతను ఫిలిప్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. డారిల్ మిచెల్ నిదానంగా ఆడినా మరోవైపు ఫిలిప్స్ చెలరేగాడు. కరణరత్నే వేసిన 14 ఓవర్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను డసన్ షనక అందుకోలేకపోయాడు. ఆ మరుసటి బంతినే బౌండరీ బాదిన ఫిలిప్స్.. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడాడు.
కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..
హసరంగా బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జేమ్స్ నీషమ్(5) ఔటైనా.. గ్లేన్ ఫిలిప్స్ ధాటిగా ఆడుతూ 61 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అదే జోరులో ధాటిగా ఆడిన అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇష్ సోదీ రనౌటవ్వగా.. సౌథీ బౌండరీతో న్యూజిలాండ్ 167 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications