
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ పిచ్‌పై ఏం ఆశించవచ్చో, ఏం చేయవచ్చో అనే విషయంపై తమకు పూర్తిగా అవగాహన ఉందన్నాడు. వాకా వేదికగా క్యాంప్‌లో పాల్గొన్న తమకు బౌన్స్ పిచ్‌లపై మంచి అవగాహన వచ్చిందన్నాడు. అటు బ్యాటర్లు.. ఇటు బౌలర్లకు ఈ క్యాంప్ ఎంతో ఉపయోగపడిందన్నాడు.
టోర్నీలో ఈ మ్యాచ్ తమకు ఎంతో కీలకమని చెప్పిన రోహిత్.. తమ రొటీన్ ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపాడు. ప్రశాంతంగా ఉంటూ తమ ప్రణాళికలను అమలు చేయడంపైనే ఫోకస్ పెడతామని పేర్కొన్నాడు. పిచ్ కండిషన్స్, ప్రత్యర్థి టీమ్‌లోని లెఫ్టాండర్స్ కారణంగా ఓ కీలక మార్పు చేశామని రోహిత్ వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నామని చెప్పాడు. లెఫ్టాండర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ ఉండాలనే దీపక్ హుడాను జట్టులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశాడు.
ఇది తమకు చాలా బిగ్ మ్యాచ్ అని చెప్పిన టెంబా బవుమా.. టోర్నీలో ముందుకు సాగాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందేనని చెప్పాడు. టోర్నీని అద్భుతంగా ప్రారంభించిన తాము అదే జోరును కొనసాగిస్తామని తెలిపాడు. బలమైన ఇండియాతో ఆడటం గొప్ప అవకాశమని చెప్పాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పిన బవుమా.. ఈ బౌలింగ్ సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత జట్టును తక్కువ స్కోర్‌కు కట్టడి చేస్తామని చెప్పాడు. ఇక్కడి కండిషన్స్.. తమ సొంతగడ్డలానే ఉంటాయని, తమ పేసర్లకు ఇది అడ్వాంటేజని తెలిపాడు. తమ జట్టులో కూడా ఓ మార్పు చేసామని చెప్పిన బవుమా.. షంసీ స్థానంలో ఎంగిడి జట్టులోకి వచ్చాడని చెప్పాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బవుమా, రిలే రాసౌ,ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వానే పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్