
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాలనంతరం పసికూన నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్‌తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బాబర్.. పసికూన జింబాబ్వే చేతిలో ఒక్క పరుగుతో ఓటమిపాలైంది. ఈ రెండు ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్.. నెదర్లాండ్స్‌తో సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 9 వికెట్లకు 91 పరుగులు చేసింది. కొలిన్ అకెర్మాన్(27 బంతుల్లో 2 ఫోర్లతో 27), స్కాట్ ఎడ్వార్డ్స్(20 బంతుల్లో 15) మినహా అంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం రెండు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రౌఫ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేదనకు దిగని పాకిస్థాన్ 13.5 ఓవర్లలో 4 వికెట్లకు 95 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(39 బంతుల్లో 5 ఫోర్లతో 49), ఫకార్ జమాన్(16 బంతుల్లో 3 ఫోర్లతో 20) రాణించారు. 92 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కూడా పాక్ బ్యాటర్లు తడబడ్డారు.
92 పరుగులతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. నెదర్లాండ్స్ సూపర్ ఫీల్డింగ్‌కు బాబర్ ఆజామ్(4) రనౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఫకార్ జామాన్‌తో కలిసి రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. దాంతో పవర్ ప్లేలో పాకిస్థాన్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.
ఆ తర్వాత ఫకార్ జమాన్(20), మహమ్మద్ రిజ్వాన్(49), షాన్ మసూద్(12) ఔటైనా.. ఇఫ్తికర్ అహ్మద్(6 నాటౌట్), షాదాబ్ ఖాన్(4 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.