దిగ్గజాల ముఖ చిత్రం ఏంటో..
ఇక మీమర్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. వెస్టిండీస్ నిష్క్రమణ తర్వాత ఆ దేశ క్రికెట్ దిగ్గజాలు సర్ వివ్ రిచర్డ్స్, సర్ గారీ సోబర్స్, సర్ క్లైవ్ లాయడ్‌ల ముఖ చిత్రం ఏంటోనని సెటైర్లు పేల్చుతున్నారు. ఫ్లైట్ మిస్సయ్యాడని హెట్‌మైర్‌ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు దానికి తగిన మూల్యం చెల్లించుకుందని, అతను వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టుకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌లో సిద్దంగా ఉంటాడని ఎద్దేవా చేస్తున్నారు. సునీల్ నరైన్,ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా ప్రపంచకప్‌లో బరిలోకి దిగితే ఇలానే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
రెండు ఓటములతో..
క్వాలిఫయింగ్ రౌండ్‌లో భాగంగా గత సోమవారం స్కాట్లాండ్‌తో ఫస్ట్ మ్యాచ్ ఆడిన వెస్టిండీస్ 42 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత బుధవారం జింబాబ్వేపై 31 పరుగుల తేడాతో గెలిచినా.. తాజాగా ఐర్లాండ్‌తో ఓడిపోవడం ద్వారా గ్రూప్-బిలో చివరి స్థానానికి వెస్టిండీస్ పడిపోయింది. విండీస్‌పై గెలిచిన ఐర్లాండ్ టీమ్ గ్రూప్-బిలో టాప్‌లో నిలవడం ద్వారా సూపర్-12కి అర్హత సాధించింది.
రెండు సార్లు చాంపియన్..
2007 నుంచి టీ20 వరల్డ్‌కప్ జరుగుతుండగా వెస్టిండీస్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2012లో తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ని ముద్దాడిన కరీబియన్లు 2016లో ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్‌ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచారు. కానీ గత ఏడాదికాలంగా టీ20ల్లో వెస్టిండీస్ ప్రదర్శన ఏమంత చెప్పుకోదగిన విధంగా లేదు. దాంతో 2022 టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయిన విండీస్ టీమ్.. క్వాలిఫయింగ్ రౌండ్‌లో పసికూన జట్లతో పోటీపడాల్సి వచ్చింది. ఇక ఓ చాంపియన్ టీమ్ ఇలా క్వాలిఫయర్స్‌లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి.
అదరగొట్టిన ఐర్లాండ్..
నేటి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలనీ మూడు వికెట్లు తీయగా.. సిమీ సింగ్, బారీ మెక్‌కార్తీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. లోర్కాన్ టకర్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ(37) కూడా పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోస్సెన్ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












