టీ20లకు నన్ను దూరం పెట్టినా.. నేను ప్రాక్టీస్ మానలేదు! రియల్ ఫ్యాన్స్ అలా చేయరు: మహమ్మద్ షమీ

అడిలైడ్: టీ20 ఫార్మాట్‌కు బీసీసీఐ తనను దూరం పెట్టినా.. తాను ప్రాక్టీస్ చేయడం మానలేదని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. టీ20 ఫార్మాట్ ఆడేందుకు నెట్స్‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడినని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2022 కోసం అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షమీ అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం షమీని టీ20 ఫార్మాట్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ పూర్తిగా దూరం పెట్టింది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించినా పరిగణలోకి తీసుకోలేదు. ఇక స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో చివరి నిమిషంలో దూరమవ్వడంతో టీమిండియా పిలుపును అందుకున్న షమీ.. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా మెగా టోర్నీ బరిలోకి దిగాడు.

దూరం పెట్టినా.. ప్రాక్టీస్ మానలేదు..
అయినా ఏ మాత్రం తడబడకుండా అద్భుత బౌలింగ్‌తో జట్టు బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో షమీ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 5 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పీటీఐతో మాట్లాడిన షమీ..తన ఆకస్మిక ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గతేడాదిగా భారత టీ20 జట్టులో నేను లేను. కానీ ఈ ఫార్మాట్‌కు తగ్గట్లు ప్రాక్టీస్ చేయడం మాత్రం మానలేదు. ప్రతీరోజూ నా శిక్షణను కొనసాగించా.. టీమ్ మేనేజ్‌మెంట్ నాతో.. అవసరమైనప్పుడు ఆడేందుకు సిద్ధంగా ఉండని చెప్పింది. దాంతో నేను నా ప్రాక్టీస్‌ను మానకుండా నా పనిని కొనసాగించాను. మీరు నా వీడియోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

మనపై మనకు నమ్మకం ఉంటే..
టీ20 ప్రపంచకప్ కు ఎంపికవ్వకముందే షమీ స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు ఎంపికయ్యాడు. కానీ కరోనా వైరస్ సోకడంతో ఈ మ్యాచ్‌లు ఆడలేదు. నేరుగా ఆస్ట్రేలియాకు రావాల్సి వచ్చింది. దీనిపై షమీ స్పందిస్తూ.. 'ఒక ఫార్మాట్ నుంచి మరో ఫార్మాట్ కు మారడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా బౌలర్ల విషయంలో.. టీమ్‌తో ఎలా కనెక్ట్ అవుతామనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే నేను మాత్రం ఇవన్నింటికంటే నా ప్రాక్టీస్ మీదే దృష్టి సారించేవాడిని. మన నైపుణ్యంపై మనకు నమ్మకం ఉంటే రాణించవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటే మన అనుభవం సహకరిస్తుంది'అని చెప్పాడు.

నిజమైన అభిమానులు..
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఓడిన అనంతరం మహమ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కొందరు ఆకతాయిలు జుగుప్పాకరమైన ట్రోలింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. షమీ మతాన్ని ప్రస్తావిస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. పాక్ విజయానికి సహకరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్రోలింగ్‌ను అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించాడు. నరం లేని నాలుకలు మాట్లాడే మాటలని షమీకి అండగా నిలిచాడు. ఈ ట్రోలింగ్ విషయాన్ని షమీ ముందు ప్రస్తావించగా.. నిజమైన అభిమానులు ఇలా చేయరని సమాధానమిచ్చాడు. 'నిజమైన అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్లను రాత్రికి రాత్రే జీరోలుగా చూడరు. నిజంగా క్రికెట్ అభిమానులు అయితే తమ అభిమాన ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా మద్దతుగా నిలుస్తారు.'అని షమీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications