
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ మైదానం వేదికగా జరగనున్న భారత్ X పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు అభిమానులకు బిగ్ రిలీఫ్ లభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ బిగ్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలున్నాయని గత 24 గంటలుగా వార్తలు షికారు చేశాయి. దాంతో ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన ఈ దాయాదుల పోరు మిస్సవుతామని ఆందోళన పడిన అభిమానులకు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఆదివారం(అక్టోబర్ 23) నాడు వాతావరణం మాములుగానే ఉండనుందని తెలిపింది. లా నినా ప్రభావం తగ్గిందని, వర్షం పడే అవకాశాలు తగ్గాయని పేర్కొంది. వెదర్ రిపోర్ట్ ప్రకారం ఆదివారం 40 శాతమే వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. దాంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.
అంతకుముందు ఆదివారం మెల్‌బోర్న్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఆస్ట్రేలియా వాతావరణం విభాగం.. బ్యూరో ఆఫ్ మెటెరాలజీ అంచనా వేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. లా నినా ప్రభావంతో మెల్‌బోర్న్ సిటీ మొత్తం మీద భారీ నుంచి అతి భారీ వర్షం పడొచ్చని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతం మీదుగా లా నినా విస్తరించిందని పేర్కొంది. వచ్చే నాలుగైదు రోజుల్లో ఇది మరింత విస్తృతమౌతుందని వివరించింది. అదే జరిగితే- మెల్‌బోర్న్ జీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం వేదికగా జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడానికే అధిక అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇదొక్కటే కాదు.. శనివారం షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దు కావొచ్చనే అంచనాలు వ్యక్తమయ్యాయి.
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు జరగాల్సిన మొట్టమొదటి మ్యాచ్ ఇది. సిడ్నీలో శనివారం వర్షం పడటానికి 90 శాతం మేర అవకాశాలు ఉన్నాయని బ్యూరో ఆఫ్ మెటెరాలజీ తెలిపింది. మూడు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావొచ్చనీ అంచనా వేసింది. ఇదే పరిస్థితి మెల్‌బోర్న్‌లో కూడా ఉత్పన్నమౌతుందని పేర్కొంది. మెల్‌బోర్న్‌లో రాత్రి వేళ 10 నుంచి 25 మిల్లీమీటర్ల వరకు వర్షం పడటానికి 90 శాతం వరకు అనుకూల వాతావరణం ఉన్నట్లు వెల్లడించింది.
టీ20 ప్రపంచకప్ 2022 గ్రూప్స్, సూపర్ 12 దశలో రిజర్వ్ డేలు లేవు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. మ్యాచ్ కొనసాగాలంటే కనీసం అయిదు ఓవర్లయినా పడాల్సి ఉంటుంది. అయిదు ఓవర్లు కూడా వేయలేని పరిస్థితి ఉంటే మ్యాచ్ రద్దవుతుంది. అయితే వాతావరణం మ్యాచ్‌కు సహకరిస్తుందో లేదో చూడాలి. వర్షం పడి మళ్లీ జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ ఓటమిపాలైంది. దాంతో అసలు వర్షమే రావద్దని కోరుకుంటున్నారు.