
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గాయాలతో స్థార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్‌లు మెగా టోర్నీకి దూరంగా కాగా.. మహమ్మద్ షమీ రాణించడంపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా నెట్ బౌలర్లుగా ఎంపికైన కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ కూడా జట్టుకు దూరమయ్యారు. పేస్ అనుకూలించే ఆసీస్ వికెట్లపై ఫాస్టెస్ట్ బౌలర్లతో భారత బ్యాటర్లను సిద్దం చేయాలనుకున్న టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వీసా సమస్యలతో ఈ ఇద్దరు బౌలర్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ మిస్సయ్యారు. అయితే వారు మళ్లీ వెళ్తారా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.
ఇప్పటికే ముఖేశ్ చౌదరి, చేతన్ సకారియా నెట్ బౌలర్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్నారు. దీపక్ చాహర్ జట్టు నుంచి వైదొలగినట్లు బీసీసీఐ వెల్లడించింది. అతనికి రీప్లేస్‌గా మరో స్పీడ్‌స్టర్ శార్దుల్ ఠాకూర్‌ను ఎంపిక చేసింది. శార్దుల్ ఠాకూర్ త్వరలో ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతోన్నాడు. ప్రస్తుతం పెర్త్‌లో ఉంటోన్న జట్టును కలవబోతోన్నాడు. శార్దుల్ ఠాకూర్‌తో పాటు వెటరన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఆస్ట్రేలియా వెళ్లడం ఖాయమైంది.
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అతణ్ని జట్టులోకి తీసుకున్నారు బీసీసీఐ సెలెక్టర్లు. టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించే సమయానికి షమీ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడతను పూర్తిగా కోలుకున్నాడు. వందశాతం ఫిట్‌నెస్ సాధించాడు. దీనితో అతణ్ని ఆస్ట్రేలియాకు పంపించనుంది బీసీసీఐ. శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లు టీమిండియాతో కలవనున్నారు.
ఈ నెల 16వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. నెదర్లాండ్స్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడతాయి. 21వ తేదీన స్కాట్లాండ్-జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్స్ దశ ముగుస్తుంది. ఆ తరువాతే అసలు పోరు ఉంటుంది. 22 తేదీ నుంచి సూపర్ 12 మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఆ మరుసటి రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది.