
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. వరుస విజయాలతో ఆశలు రేకెత్తించిన రోహిత్ సేన.. చివరకు సెమీఫైనల్లో ఊసరుమనిపించింది. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం మాత్రం ఓపెనర్ల వైఫల్యం, పేలవ బౌలింగ్. అయితే ఆటల్లోగెలుపొటములు సహజమే. కానీ ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిన తీరు సగటు అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒక్క వికెట్ తీయలేకపోయినా టీమిండియా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
ట్విటర్ వేదికగా భారత జట్టుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన రాహుల్.. హృదయం ముక్కలైందనే ఏమోజీని క్యాప్షన్‌గా పెట్టాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న భారత జట్టు ఫొటోను ట్వీట్‌కు జత చేశాడు. తాను ఎంత బాధకు గురవుతున్నానో అనే విషయాన్ని ఈ ట్వీట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కొందరు ఓదార్చే ప్రయత్నం చేయగా.. మరికొందరు చెత్తగా ఆడావంటూ మండిపడ్డారు. ఆటతీరు మార్చుకోవాలంటూ హితబోధ చేశారు. మరోవైపు కేఎల్ రాహుల్ మాదిరిగానే పలువురు కీలక ఆటగాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ జాబితాలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు.