
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. అంతేకాకుండా గత మ్యాచ్‌లో(ఆస్ట్రేలియాతో) తమ జట్టు ముందు బ్యాటింగ్ చేసి అద్భుతంగా రాణించందని గుర్తు చేశాడు. ఈ టోర్నీలో తాము విభిన్న పరిస్థితుల్లో భిన్నమైన జట్లతో ఆడుతున్నామని తెలిపాడు. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన డారిల్ మిచెల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడని,
మార్క్ చాప్‌మన్ స్థానంలో తీసుకున్నామని తెలిపాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.
తాము టాస్ గెలిచినా ముందే బ్యాటింగ్ చేసేవాళ్లమని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. అయితే ఈ చేజింగ్ సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పాడు. టాస్ ఓడినందుకు తమకు ఎలాంటి నిరాశ లేదని, పరుగులు చేయగల సత్తా బ్యాటర్లకు ఉంటే కట్టడి చేయగల సామర్థ్యం బౌలర్లకు ఉందని చెప్పాడు. తమ జట్టులో కూడా ఒక మార్పు చేశామని చెప్పిన డసన్ షనక.. బినురా ఫెర్నాండో స్థానంలో కాసున్ రజితా జట్టులోకి వచ్చాడని చెప్పాడు. టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఈ మార్పు చేశామని స్పష్టం చేశాడు.
వర్షం కారణంగా గ్రూప్-1లో మూడు మ్యాచ్‌లు రద్ద్వడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమైంది. ముఖ్యంగా శ్రీలంకకు ఇది చావో రేవో మ్యాచ్. ఇప్పటికే ఓ ఓటమి చూసిన ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరి గెలవాలి.
తుది జట్లు:
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డసన్ షనక, వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, లాహిరు కుమారా, కాసున్ రజితా
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లేన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టీమ్ సౌథీ, ఇష్ సోదీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్