
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73), అలెక్స్ హేల్స్(40 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు. దాంతో ఇంగ్లండ్ న్యూజిలాండ్ ముందు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది.
ఓపెనర్లు తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 19వ ఓవర్ వరకు క్రీజులో ఉన్న బట్లర్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. లివింగ్ స్టోన్(14 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20) మెరుపులు మెరిపించగా.. మొయిన్ అలీ(5), హరీ బ్రూక్(7), బెన్ స్టోక్స్(8) విఫలమయ్యారు. 19వ ఓవర్‌లో కేన్ మమా సూపర్ ఫీల్డింగ్‌తో జోస్ బట్లర్‌ను రనౌట్ చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్‌కు బ్రేక్ పడింది.
న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే న్యూజిలాండ్ గ్రూప్-1 నుంచి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అదే జరిగితే టోర్నీ నుంచి ఇంగ్లండ్ దాదాపు నిష్క్రమిస్తుంది. గ్రూప్-1లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు రద్దవ్వడంతో సెమీస్ సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ రెండు విజయాలతో 5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, శ్రీలంక తర్వాతి స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ నాలుగో స్థానంలోకొనసాగుతోంది. ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి.