
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 నుంచి టీమిండియా నిష్క్రమించడం యావత్ భారత్‌ను నిరాశకు గురిచేసింది. టైటిల్ తెస్తుందనుకున్న రోహిత్ సేన.. ఉట్టి చేతులతోనే తిరుగు పయనమవ్వడం అభిమానులను కలిచివేసింది. ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన కీలక సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోసారి టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. దాంతో భారత క్రికెట్ అభిమానులంతా బాధపడుతుంటే.. కొందరు మాత్రం.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందే మంచిదయ్యిందని కామెంట్ చేస్తున్నారు.
ఈ చెత్త టీమ్‌తో ఫైనల్ చేరి.. పాకిస్థాన్ చేతిలో ఓడితే ఆ ఓటమిని అస్సలు తట్టుకోలేకపోయేవాళ్లమని, ఆ పరాభావం మరి దారుణంగా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. పేలవ బౌలింగ్, చెత్త ఓపెనింగ్‌తో సెమీస్‌కు చేరడమే గొప్ప విషయమని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసంతో భారత ఆటగాళ్లు కనీస పోరాటపటిమను కనబర్చలేకపోయారు.
ఇక మ్యాచ్ పోయినట్టేనని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినట్టు కనిపించారు. బౌండరీ లైన్ దగ్గర ఉన్నవాళ్లు కూడా పరుగెత్తడానికి, బంతిని ఆపడానికి పెద్దగా కష్టపడలేదు, ప్రయత్నించలేదు. భారత జట్టులో కనిపించిన ఈ యాటిట్యూడ్... సగటు క్రికెట్ ఫ్యాన్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకపోయినా యజ్వేంద్ర చాహాల్ ఆడకపోయినా సెమీ ఫైనల్ వరకూ వచ్చింది భారత జట్టు. కారణం విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చూపించిన మాస్టర్ క్లాస్ బ్యాటింగేనని సెమీ ఫైనల్ వైఫల్యం మరోసారి రుజువు చేసింది.
బౌలింగ్‌కి అనుకూలించిన పిచ్‌పై వికెట్లు తీయడం, బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం తప్ప... భారత బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి చిన్న టీమ్స్‌పై చెలరేగిన మన బౌలర్లు... సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మరోవైపు ఓపెనర్లు ఒక్క మ్యాచ్‌లో కూడా సరైన శుభారంభం అందించలేకపోయారు. ఇలాంటి ప్లేయర్లతో ఇక్కడిదాకా రావడమే చాలా ఎక్కువని, గత ఎడిషన్ కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చామని సరిపెట్టుకోవాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.