T20 World Cup 2022: బిస్కెట్ సెంటిమెంట్ గంగలో కలిసింది.. పాక్ సెంటిమెంటే గెలిచింది!
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా కథ ముగిసింది. గురువారం జరిగిన కీలక సెమీఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తయ్యింది. ఈ ఘోర పరాజయంతో తట్టాబుట్టా సర్దుకొని టీమిండియా తిరుగు పయనమైంది. అయితే ఈ మ్యాచ్ ముందు వరకు ఈసారి టైటిల్ మనదేనని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మ ఈసారి టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందిస్తాడని ఆశించారు. అంతేకాకుండా 2011 వన్డే ప్రపంచకప్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ఓరియో బిస్కెట్ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని లెక్కలు వేసుకున్నారు. మరోవైపు పాకిస్థాన్ అభిమానులు మాత్రం 1992 సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్నారు.
పాక్ సెంటిమెంటే రిపీట్ అయ్యింది..
1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియానే వేదికగా జరగడం, అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాక్ చేరుకోవడం ఆ జట్టు అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ఆ టోర్నీలో ఇప్పటిలానే పాకిస్థాన్, ఇంగ్లండ్ ఫైనల్ చేరాయి. టైటిల్ ఫైట్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన పాక్.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆదివారం జరిగే ఫైనల్లోనూ పాక్ గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు ముందే ఈ లెక్కలు కట్టారు.
బిస్కెట్ సెంటిమెంట్..
భారత్ ఓటమి ముందు వరకు ఇండియన్ ఫ్యాన్స్ 2011 వన్డే వరల్డ్ కప్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ టీమిండియా సౌతాఫ్రికా చేతిలో ఓడిందని, ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం నమోదు చేసిందని, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరకుండా ఇంటిదారిపట్టాయని, భారత్, న్యూజిలాండ్, పాక్ సెమీస్‌కు వచ్చాయని చెబుతూ.. టైటిల్ మనదేనని సంతోషం వ్యక్తం చేశారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఓరియో బిస్కెట్ అంబాసిడర్‌గా ధోనీ కూడా.. 2011లో ఓరియో లాంచ్ అయ్యిందని అప్పుడు భారత్ టైటిల్ గెలిచిందని, ఈసారి రీలాంచ్ చేస్తున్నామని మళ్లీ టైటిల్ గెలుస్తుందని చెప్పాడు.
ఓరియోను బ్యాన్ చేయాలి..
చివరకు భారత్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టడంతో ఓరియో బిస్కెట్‌ను బ్యాన్ చేయాలంటూ క్రికెట్ అభిమానులు పిలుపునిస్తున్నారు. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్లీ ధోనీ శకం తిరిగిరాదని, ఐసీసీ టైటిళ్లు గెలవడం ఐపీఎల్ గెలిచినంత ఈజీ కాదని రోహిత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ నిర్వహణపై ఉన్న శ్రద్ద ఐసీసీ టోర్నీలపై లేదని మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications