
లక్కీగా సెమీస్..
అసలు టీమిండియా గ్రూప్-1లో ఉంటే నాకౌట్ చేరకుండా వెనుదిరిగేది. బలహీనమైన జట్లు ఉన్న గ్రూప్-2లో ఉండటం వల్లే జట్టు సెమీఫైనల్‌కు చేరింది. కానీ పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించలేక ఇంటిదారిపట్టింది. గ్రూప్-2లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే జట్లు పాకిస్థాన్, సౌతాఫ్రికా ఉండగా.. ఇందులో పాక్‌పై విరాట్ కోహ్లీ పుణ్యమా ఆఖరి బంతికి విజయాన్నందుకుంది. సౌతాఫ్రికాను ఓడించలేకపోయింది. పసికూన బంగ్లాదేశ్‌పై కూడా చెమటోడ్చి నెగ్గింది. జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై సునాయస విజయాలను అందుకొని సెమీస్ బెర్త్ ఖారారు చేసుకుంది.

గ్రూప్-1లో ఉంటేనా..?
అదే గ్రూప్-1లో టీమిండియా ఉండి ఉంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్లతో పోటీపడలేకపోయేదనేది వాస్తవం. గ్రూప్-1లో ఆస్ట్రేలియా ఏడు పాయింట్లు సాధించినా మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా నాకౌట్ చేరలేకపోయింది. వాస్తవానికి గ్రూప్-2 కంటేనే గ్రూప్-1లో బలమైన జట్లు ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో ఓపెనర్ల వైఫల్యం, పేలవ బౌలింగే టీమిండియా కొంపముంచాయి. సెమీస్ ఓటమి అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టు వైఫల్యాన్ని బౌలర్లపైకి నెట్టేసాడు.

రోహిత్ సుద్దపూస అయినట్లు..
వారు నాకౌట్ ఒత్తిడిని అధిగమించలేకపోయారని, ఒత్తిడి గురించి ప్రత్యేకంగా పాఠాలు చెప్పడం కుదురదని సుద్దపూస మాటలు మాట్లాడాడు. కానీ బౌలర్ల వైఫల్యం ఎంత ఉందో కెప్టెన్‌గా, సీనియర్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ వైఫల్యం అంతే ఉంది. నెదర్లాండ్స్‌తో హాఫ్ సెంచరీ మినహా రోహిత్ బ్యాటింగ్ పీకిందేం లేదు. కీలక సెమీస్‌లో 27 బంతులాడి 28 పరుగులు చేసి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. బౌలింగ్ ఎంత బలహీనమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంకో 4 ఓవర్లుండగానే ఛేదించడం కెప్టెన్సీ వైఫల్యానికి సూచికే.

మ్యాచ్‌కు ముందే ఓడిపోతామనేలా వ్యాఖ్యలు..
'నాకౌట్ మ్యాచ్‌లు ముఖ్యమైనవి. అందులో మెరుగైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో ఒక్క నాకౌట్ మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ అంచనాకు రాకూడదు'.. ఇంగ్లండ్‌తో సెమీస్ ముంగిట కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడిన మాటలివి.తన జట్టు మీద తనకే నమ్మకం లేదో ఏమో.. సెమీస్ మ్యాచ్ ఆడబోతూ సమరోత్సాహంతో మాట్లాడాల్సిన వాడు కాస్తా వైఫల్యం గురించి ప్రస్తావించాడు. జట్టుతో పాటు కెప్టెన్ ఆత్మవిశ్వాస లోపాన్ని సూచించే విషయం ఇది.


Click it and Unblock the Notifications
