T20 World Cup 2022: చెలరేగిన స్వింగ్ కింగ్.. న్యూజిలాండ్ గ్రాండ్ విన్.. శ్రీలంక ఔట్!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో శ్రీలంక కథ ముగిసింది. ఆసియాకప్ 2022 విజయంతో భారీ అంచనాలను అందుకున్న శ్రీలంక.. మెగా టోర్నీలో ఆ జోరును కొనసాగించలేకపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. వాటిలో విజయం సాధించినా లంక ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా గ్రూప్-1లో మూడు మ్యాచ్‌లు రద్దవ్వడంతో సెమీఫైనల్ సమీకరణం గందరగోళంగా మారింది. ఏడేసి పాయింట్లు సాధించిన జట్లకే సెమీఫైనల్ చేరే దిక్కులేదు. ఈ పరిస్థితుల్లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా లంకకు 6 పాయింట్లే వస్తాయి. శనివారం న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంక చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. 65 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఫిలిప్స్ సెంచరీ..
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆ జట్టులో గ్లేన్ ఫిలిప్స్(64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104) సెంచరీతో చెలరేగాడు. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును విరోచిత శతకంతో ఆదుకున్నాడు. అతనికి తోడుగా డారిల్ మిచెల్(24 బంతుల్లో 22) నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. లంక బౌలర్లలో కాసున్ రజిత రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ, ధనంజయ డిసిల్వా, వానిందు హసరంగా, లాహిరు కుమారా తలో వికెట్ తీసారు. ఓ దశలో కివీస్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఆ జట్టు చెత్త ఫీల్డింగ్ కివీస్‌కు కలిసొచ్చింది.
చెత్త బ్యాటింగ్..
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకు కుప్పకూలింది. కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(4/13) నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మిచెల్ సాంట్నర్(2/21), ఇష్ సోదీ(2/21) రెండేసి వికెట్లతో దెబ్బతీసారు. టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు. లంక బ్యాటర్లలో భానుక రాజపక్స(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), డసన్ షనక(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
దెబ్బతీసిన సౌథీ, బౌల్ట్
ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే సౌథీ.. శ్రీలంకకు షాకిచ్చాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సంకను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన రెండో ఓవర్‌లో కుశాల్ మెండీస్(4), ధనంజ డిసిల్వా(0) వెనుదిరగ్గా.. తన మరుసటి ఓవర్‌లో చరిత్ అసలంక(4) ఔటయ్యాడు. దాంతో 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. పవర్ ప్లేలో 24 పరుగులే చేసింది. ఆ వెంటనే కేన్ మామ స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. సాంట్నర్ వేసిన తొలి బంతికే చమిక కరుణరత్నే(3) ఔటయ్యాడు. దాంతో 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంక 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది.
రాజపక్స ఆదుకునే ప్రయత్నం చేసినా..
కానీ క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స.. కివీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్పిన్నర్లతో లాభం లేదని ఫెర్గూసన్‌ను తీసుకొచ్చిన కేన్ మామ.. రాజపక్సకు చెక్ పెట్టించాడు. ఆ తర్వాత హసరంగా(4), తీక్షణ(0), లాహిరు కుమారా(4)లను స్పిన్నర్లు ఔట్ చేయడంతో లంక పోరాటం ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications