కోహ్లీలా ఆడేవారు లేరు..
'టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీలా యాంకర్ రోల్ పోషించడం.. చివరి 10 ఓవర్లలో దూకుడు ఆడటం మరెవరి వల్లా కాదు. టీమిండియాలోనే కాదు ప్రపంచంలోనే కోహ్లీలా యాంకర్ రోల్ పోషించి భాగస్వామ్యాలు నెలకొల్పే ఆటగాడు లేడు. ఈ తరం అత్యుత్తమ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజామ్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌ల కంటే కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్. కోహ్లీలా యాంకర్ రోల్ పోషించడంతో పాటు దూకుడుగా ఆడే సామర్థ్యం ఈ ముగ్గురి ఆటగాళ్లలో లేదు.

కఠిన పరిస్థితుల్లో..
పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు.. కీలక వికెట్లు కోల్పోయినప్పుడు సహచర ఆటగాళ్లతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించే తీరు అమోఘం. ఈ రోజు మ్యాచ్‌లో రాహుల్ ఔటైన అనంతరం విరాట్.. సూర్యకుమార్ యాదవ్‌తో ఇదే పని చేశాడు. ఆ తర్వాత అతనే సూపర్ హీరోగా మారి జట్టుకు కావాల్సిన స్కోర్ అందించాడు.
ఈ తరహా సామర్థ్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీని గంభీర్ కొనియాడటం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే కోహ్లీ కంటే సూర్య గొప్ప బ్యాటరని చెప్పిన గంభీర్ ఇంతలోనే మాట మార్చడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రాణించిన రాహుల్, కోహ్లీ ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

లిటన్ దాస్ పోరాడినా..
అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 16 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లిటన్ దాస్(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), నురుల్ హసన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications
