
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో రెండు వరుస విజయాల తర్వాత ఖంగుతిన్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరగనున్న కీలక పోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. పాకిస్థాన్‌పై చిరస్మరణీ విజయాన్నందుకున్న టీమిండియా... అదే జోరులో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. కానీ సౌతాఫ్రికాపై ఆ జోరు కనబర్చలేక తొలి ఓటమి చవిచూసింది. చెత్త ఫీల్డింగ్‌తో చేజేతులా గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
ఈ పరాజయంతో పీకలమీదకు తెచ్చుకున్న టీమిండియా సెమీస్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ ఓడినా.. వర్షంతో రద్దయినా విషమ పరిస్థితులను ఎదుర్కొనుంది. అయితే బంగ్లాదేశ్ జట్టుపై టీ20ల్లో టీమిండియాకు మంచి రికార్డే ఉన్నప్పటికీ.. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఓడించినంత పనిచేసింది. అయితే టీమిండియా ముందు బంగ్లాదేశ్ చాలా బలహీనం. అంతమాత్రాన ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం.
అయితే ఈ మ్యాచ్ జరగనున్న అడిలైడ్ వేదిక ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది. ఇదే వేదికపై టీమిండియా అత్యంత ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా 36 పరుగులకే ఆలౌటై ఇజ్జత్ తీసుకుంది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా పేస్‌కు నిలవలేకపోయిన భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అందరూ విఫలమయ్యారు. బంగ్లాతో అడిలైడ్ వేదికగా మ్యాచ్ అనగానే ఫ్యాన్స్ ఈ ఫలితాన్నే గుర్తు చేసుకొని కలవరపడుతున్నారు. అంతేకాకుండా ఇదే వేదికపై బంగ్లాదేశ్ 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు 15 పరుగులతో షాకిచ్చింది.
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం, టీమిండియా సెమీస్ అవకాశాలు ఈ ఫలితంపైనే ఆధారపడి ఉండటంతో అభిమానులకు భయం డబుల్ అయ్యింది. అయితే అడిలైడ్ వేదికగా విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు ఉండటం ఊరటనిచ్చే అంశం. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఏకైక టీ20 మ్యాచ్ ఆడిన భారత్.. 37 పరుగులతో విజయం సాధించింది.