T20 World Cup 2022: కేన్ మామ.. నీ గుండె గట్టిదయ్యా! ఒకటా.. రెండా.. నాలుగు సార్లు నిరాశే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లోనూ న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది. వరుసగా ఐదో ప్రపంచకప్ టోర్నీలోనూ ఆ జట్టు టైటిల్ అందుకోలేకపోయింది. 2015 నుంచి ప్రతీ ప్రపంచకప్‌లో నాకౌట్ చేరుతున్న కివీస్..
లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోతుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న తాజా టీ20 ప్రపంచకప్‌లోనూ అసాధారణ ప్రదర్శనతో సెమీ ఫైనల్ చేరిన ఆ జట్టు.. పాకిస్థాన్‌ను ఓడించలేక మళ్లీ ఉట్టి చేతులతోనే ఇంటిదారి పట్టింది. 2015 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం ప్రతీ ఐసీసీ టోర్నీలో (2017 ఛాంపియన్స్ ట్రోఫీ మినహా) నాకౌట్ దశ ధాటిన కివీస్.. విశ్వ విజేతగా మాత్రం నిలవలేకపోయింది.
సారథిగా నాలుగు టైటిళ్లు చేజారే..
ముఖ్యంగా కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఆ జట్టు నాలుగు సార్లు టైటిల్ చేజార్చుకుంది. ఇందులో రెండు సార్లు సెమీఫైనల్లో వెనుదిరగ్గా.. మరో రెండు సార్లు ఫైనల్లో చేతులెత్తేసింది. ఆ జట్టును దురదృష్టం కూడా వెంటాడింది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న ఆ జట్టు.. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అనైతిక నిబంధనలతో టైటిల్ అందుకోలేకపోయింది. సూపర్ ఓవర్లతో ఫలితం తేలకపోవడంతో బౌండరీ కౌంట్ అనే అసంబద్దమైన నిబంధనతో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది.
ఆ చిరునవ్వు చెరగలేదు..
తాజా టోర్నీ సెమీఫైనల్లో పాకిస్థాన్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలై ఇంటిదారి పట్టింది. ఈ నాలుగు సార్లు ప్రతికూల ఫలితం వచ్చినా.. అసంబద్దమైన నిబంధనతో ఇంగ్లండ్ టైటిల్ ఎగరేసుకుపోయినా.. కేన్ విలియమ్సన్ ముఖంలో మాత్రం చిరునవ్వు చెరగలేదు. చివరి వరకు పోరాడటమే తమ పనని, ఫలితం తమ చేతుల్లో ఉండదని గట్టిగా నమ్మే కేన్ మామను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నాలుగు టోర్నీల్లో తృటిలో టైటిల్ చేజారినా.. ఏ మాత్రం సడలని అతని గుండె ధైర్యం గొప్పదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం..
ఓటమి వెక్కిరించినా.. సన్నగిల్లని అతని ఆత్మవిశ్వాసం ప్రతీ ఒక్కరికి స్పూర్తి దాయకం అంటూ ఫ్యాన్స్ కేన్ మామపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేన్ విలియమ్సన్ స్థానంలో మరో ఆటగాడు ఎవరున్నా...కెరీర్ ముగిసిపోయేదని, ముఖ్యంగా 2019 ప్రపంచకప్ ఫైనల్లో రచ్చ చేసేవారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు.. కేన్ మామపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..
గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(42 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(43 బంతుల్లో 5 ఫోర్లతో 57), బాబర్ ఆజామ్(42 బంతుల్లో 7 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications