T20 World Cup 2022: ఆ ఇద్దరి వైఫల్యమే టీమిండియా దుస్థితికి కారణం!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తున్న రోహిత్ సేనకు ఇంగ్లండ్ కళ్లెం వేసింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ప్రపంచకప్‌ను ముద్దాడే సువర్ణవకాశాన్ని మరోసారి చేజార్చుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్ వైఫల్యం కారణంగానే విజయం సాధించలేకపోయామని చెప్పాడు. ఆరంభంలో సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా.. చివర్లో మంచి లక్ష్యాన్ని నమోదు చేశామని, ఒత్తిడిని అధిగమించలేకనే తమ ప్లేయర్లు విఫలమయ్యారని చెప్పుకొచ్చాడు.

ఓపెనర్ల వైఫల్యమే..
రోహిత్ శర్మ చెప్పినట్లు 169 పరుగుల లక్ష్యం కాపాడుకోదగినదే. బౌలింగ్ వైఫల్యం కూడా జట్టు ఓటమికి ఓ కారణమే. కానీ బౌలర్ల కంటే ఓపెనర్ల వైఫల్యమే టీమిండియా దుస్థితికి కారణమనేది కాదనలేని సత్యం. ఈ టోర్నీ ఆసాంతం భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. 6 మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా సరైన శుభారంభాన్ని అందించలేకపోయారు. ఈ ఆరు మ్యాచ్‌ల్లో భారత్ ఓపెనింగ్ భాగస్వామ్యాలు వరుసగా 7, 11, 23, 11, 27, 9గా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సూర్య, కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో సెమీస్‌కు చేరింది.

ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం..
సెమీఫైనల్లో భారత్ కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఇదే పిచ్‌పై వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేయగలిగింది. వారు తొలి బంతి నుంచే భారత బౌలర్లపైకి ఎదురు దాడికి దిగారు. దాంతో భారత ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు స్వేచ్చగా చెలరేగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే పిచ్ రిపోర్ట్ చూసిన షేన్ వాట్సన్.. ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పాడు. కానీ భారత ఓపెనర్లు మాత్రం స్వేచ్చగా ఆడలేకపోయారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ నాకౌట్ ప్రెజర్‌ను హ్యాండిల్ చేయలేకపోయాడు. దాంతోనే ఆరంభంలోనే వికెట్ ఇచ్చుకొని టీమ్‌పై అనవసర ఒత్తిడి పెట్టాడు.

ఓపెనర్ల వైఫల్యంతో ఒత్తిడి..
తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోవడం.. నాకౌట్ సమరం కావడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు మరింత ప్రెజర్‌కు లోనయ్యారు. వికెట్‌ను కాపాడుకునే ఆలోచనతో ఆత్మరక్షణగా ఆడారు. ఇదే భారత్ కొంపముంచింది. తొలి బంతి నుంచే రాహుల్, రోహిత్ ఎదురుదాడికి దిగుంటే ఇంగ్లండ్ బౌలర్లు చేతులెత్తేసేవారు. పవర్ ప్లేలో మంచి ఆరంభం దక్కి ఉంటే తర్వాత వచ్చే కోహ్లీ, సూర్య మరింత స్వేచ్చగా చెలరేగేవారు. అప్పుడు భారత్ భారీ స్కోర్ చేసేందుకు ఆస్కారం ఉండేది.

రోహిత్ జిడ్డు బ్యాటింగ్..
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ జిడ్డు బ్యాటింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో 28 బంతులాడిన రోహిత్ కేవలం 27 పరుగులే చేశాడు. ఇది కోహ్లీతో పాటు తర్వాత వచ్చిన సూర్యను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలోనే ధాటిగా ఆడాలనే ఆలోచనతో సూర్య క్యాచ్ ఔటయ్యాడు. ఇక రోహిత్ ఈ టోర్నీలో పసికూన నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీ మినహా ప్రతీ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో (4, 53, 15, 2, 15, 27)116 పరుగులే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications