
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత నిబద్దత కలిగిన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటను అమితంగా ప్రేమించే విరాట్ కోహ్లీ.. మైదానంలో దూకుడు ప్రదర్శించినా.. ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరుపారేసుకున్నా.. తొండాట మాత్రం ఆడడు. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా తనకిష్టమైన గేమ్‌కు సంబంధించి మాత్రం అవకతవకలకు పాల్పడడు. అంపైర్లు ఔటివ్వకున్నా.. తాను ఔటని భావిస్తే క్రీజును వదలడానికి కూడా వెనుకాడడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చిరస్మరణీ విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ ఆటపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
రూల్స్ ప్రకారమే ఆడాడు తప్పా.. మోసానికి పాల్పడే పనిచేయలేదు. నోబాల్‌కు క్లీన్ బౌల్డ్ అయినప్పుడు చాకచక్యంగా మూడు పరుగులు తీసాడు. నోబాల్ కోసం అంపైర్లను గట్టిగా ప్రశ్నించాడు. అంతేకానీ అడ్డదారిలో విజయాన్నందుకోవాలని భావించలేదు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకున్నా.. విరాట్ మాత్రం రూల్స్‌కు కట్టుబడే ఆడాడు.
చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లోనూ విరాట్ కోహ్లీ.. బౌలర్ బంతి వేసేవరకు క్రీజులోనే ఉన్నాడు. మహమ్మద్ నవాజ్ వైడ్ వేసిన బాల్‌తో పాటు చివరి బంతికి కూడా పరుగుకోసం క్రీజును ధాటలేదు. బౌలర్ బంతి వేయాడాన్నే గమనించాడు. మాములుగా ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్ రనప్ పూర్తి చేయకముందే బ్యాటర్లు సగం క్రీజు వరకు పరుగెత్తుతుంటారు. తద్వారా సింగిల్ పూర్తి చేయాలని భావిస్తారు. ఈ క్రమంలోనే బౌలర్లు బంతిని వికెట్లకు గీరాటేసి రనౌట్ చేస్తారు. గతంలో దీన్ని మన్కడింగ్‌గా పిలిచేవారు. అనైతికమైన చర్యగా విమర్శించేవారు. ఈ విధానంపై వివాదం చెలరేగడంతో ఐసీసీ.. నైతికంగా మారుస్తూ రనౌట్‌గా మార్చేసింది. ఇటీవల దీప్తి శర్మ ఇలానే ఇంగ్లండ్ బ్యాటర్‌ను ఔట్ చేయగా.. ఇంగ్లీష్ మీడియా గగ్గోలు పెట్టింది.
పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ క్రీజును ధాటకపోవడంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. విరాట్ బ్లడ్‌కే చీటింగ్ తెలియదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చివరి రెండు బంతులకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.