
హోబర్ట్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. లంక స్పిన్నర్లు వానిందు హసరంగా(2/25), మహీశ్ తీక్షణ(2/19) రెండేసి వికెట్లు తీయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. హారీ టెక్టార్(42 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 45) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
శ్రీలంక బౌలర్లలో బినౌర ఫెర్నాండో, లాహిరు కుమార, చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 9 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37 బ్యాటింగ్), ధనుంజయ డిసిల్వా(25 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సూపర్ 12లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలనీ మూడు వికెట్లు తీయగా.. సిమీ సింగ్, బారీ మెక్‌కార్తీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. లోర్కాన్ టకర్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ(37) కూడా పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోస్సెన్ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు.