T20 World Cup 2022: చెలరేగిన రాహుల్, విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం!

అడిలైడ్: విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. రాహుల్, కోహ్లీ హాఫ్ సెంచరీలకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 4 ఫోర్లతో 30) రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

రోహిత్ విఫలం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మరోసారి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2) క్యాచ్ ఔటయ్యాడు. అప్పటికే ఒక లైఫ్ వచ్చినా.. షార్ట్ బాల్ బలహీనతకు వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో తడబడ్డ రాహుల్.. రెండో ఓవర్‌లో సిక్సర్ బాది టచ్‌లోకి వచ్చాడు. రోహిత్ ఔటైనా.. ఏ మాత్రం జంకని రాహుల్.. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 37 పరుగులే చేసినా.. రాహుల్ ధాటిగా ఆడి లెక్క సరిచేశాడు.

రాహుల్ హాఫ్ సెంచరీ..
షోరిఫుల్ ఇస్లామ్ వేసిన 9వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 24 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్‌లో రాహుల్ ఒకే బంతికి 14 పరుగులు పిండుకున్నాడు. ఇస్లామ్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని రాహుల్.. లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించింది. ఒత్తిడికి గురైన ఇస్లామ్ వైడ్ వేయగా.. తర్వాతి బంతిని రాహుల్.. డీప్ పాయింట్ దిశగా మరో సిక్సర్ బాదాడు. దాంతో ఒకే బంతికి 14 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్‌లో క్విక్ డబుల్ తీసిన రాహుల్.. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని విమర్శకులకు ఇచ్చిపడేసాడు. అయితే అదే జోరులో మరుసటి బంతి భారీ షాట్‌కు ప్రయత్నించిన రాహుల్.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ హాఫ్ సెంచరీ..
క్రీజులోకి వచ్చిన సూర్య వచ్చి రావడంతోనే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హసన్ మహముద్ వేసిన 13వ ఓవర్‌లో సూర్య మూడు బౌండరీలు బాదాడు. అయితే అతని జోరుకు షకీబ్ బ్రేక్ వేసాడు. మరోవైపు విరాట్ సైతం రాణించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన విరాట్.. ఇస్లామ్ 17వ ఓవర్‌లో క్విక్ డబుల్‌తో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కార్తీక్ రనౌటైనా... అక్షర్ పటేల్ విఫలమైనా.. కోహ్లీ తన జోరును ఆపలేదు. 19వ ఓవర్‌లో కోహ్లీ 4, 6 బాదగా.. ఆఖరి ఓవర్‌లో అశ్విన్ కూడా 6, 4 కొట్టాడంతో టీమిండియా 184 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications