
చెలరేగిన బాబర్, రిజ్వాన్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(42 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(43 బంతుల్లో 5 ఫోర్లతో 57), బాబర్ ఆజామ్(42 బంతుల్లో 7 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టాడు.

అదిరిపోయే ఆరంభం..
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ అదిరిపోయే శుభారంభం అందించారు. టోర్నీ ఆసాంతం విఫలమైన ఈ జోడీ.. అసలు సిసలు మ్యాచ్‌లో సత్తా చాటింది. తొలి ఓవర్ నుంచే న్యూజిలాండ్ బౌలర్లపైకి ఎదురు దాడికి దిగింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో బాబర్ ఆజామ్ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను కీపర్ డెవాన్ కాన్వే నేలపాలు చేశాడు. ఆ వెంటనే రనౌటయ్యే ప్రమాదాన్ని కూడా బాబర్ తప్పించుకున్నాడు. ఈ అవకాశాలతో రెచ్చిపోయిన అతను బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టాపోకుండా పాక్ 55 పరుగులు చేసింది.

105 పరుగుల భాగస్వామ్యం..
ఆ తర్వాత స్పిన్నర్లు బరిలోకి దిగినా.. పాక్ ఓపెనర్లు స్మార్ట్‌గా క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో జట్టు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. నిలకడగా ఆడిన ఈ జోడీ కివీస్ బౌలర్ల తప్పిదాలను క్యాష్ చేసుకొని చెలరేగింది. దాంతో పాక్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. ఫెర్గూసన్ వేసిన మరుసటి ఓవర్‌లో క్విక్ సింగిల్ తీసిన బాబర్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో బౌల్ట్ బౌలింగ్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చెత్త ఫీల్డింగ్..
బాబర్ ఔట్ అయినా.. క్రీజులోకి మహమ్మద్ హరీస్‌తో రిజ్వాన్.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇష్ సోదీ వేసిన 14వ ఓవర్ క్విక్ సింగిల్‌తో రిజ్వాన్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమ్ సౌథీ వేసిన 16వ ఓవర్‌లో మహమ్మద్ హరీస్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సాంట్నర్ నేలపాలు చేశాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 17వ ఓవర్ ఆఖరి బంతికి మహమ్మద్ రిజ్వాన్ క్యాచ్ ఔటవ్వగా.. పాక్ విజయానికి 18 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి.
ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్‌లో హరీస్.. సిక్స్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్ పూర్తిగా పాక్ వైపు మళ్లింది. సాంట్నర్ వేసిన 19వ ఓవర్‌లో హరీస్ ఇచ్చిన క్యాచ్‌ను సోదీ నేలపాలు చేశాడు. అయితే ఈ ఓవర్ చివరి బంతికి హరీస్ క్యాచ్ ఔటవ్వగా.. చివరి ఓవర్ తొలి బంతిని సౌథీ వైడ్ వేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత షాన్ మసూద్ సింగిల్ తీసి విజయ లాంఛనం పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications












