
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో భాగంగా భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. పెర్త్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా పేసర్ల మధ్య పోరు ఉండనుందని ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు.
శనివారం మీడియాతో మాట్లాడిన మార్‌క్రమ్ కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని తమ పేసర్లు ఎంతో ఇష్టపడతారని పేర్కొన్నాడు.
'ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మా పేసర్లు కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తారు. అతను ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు, కానీ మా బౌలర్లు కూడా బాగా రాణిస్తున్నారు. మిగతా పిచ్‌ల కంటే పెర్త్ పిచ్ మరింత బౌన్స్ అయ్యే అవకాశముందని.. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో తమ బౌలర్లు ఆకట్టుకుంటారని మార్‌క్రమ్ ధీమా వ్యక్తం చేశాడు. తమ టాప్ ఆర్డర్ రాణిస్తే జట్టు మంచి స్కోర్ చేయగలదని పేర్కొన్నాడు.
'టాప్ ఆర్డర్ విజృంభిస్తే, మిగతా బ్యాటర్లు ఆ ఊపును కొనసాగిస్తారు. లేదా జట్టు కష్టాల్లో ఉంటే, ఎవరో ఒకరు స్కోరు బోర్డును నడిపించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది' అని మార్కరమ్ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్జ్ మాట్లాడుతూ.. తమ జట్టు పేస్ అత్యుత్తమంగా ఉందని పేర్కొన్నాడు. అతిగా బౌన్స్ అయ్యే పెర్త్ పిచ్‌పై ప్రశాంతంగా బౌలింగ్ చేయాలని తమ బౌలర్లకు సూచించాడు. భవిష్యత్తులో ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసే అవకాశం రావాలని ఈ సందర్భంగా కోరుకున్నాడు. 'టెస్టులు, వన్డేల్లో రెండు బౌన్సర్లు వేసే అవకాశం ఉంది. ఎప్పటికైనా టీ20ల్లోనూ ఈ నిబంధన తీసుకొస్తారని ఆశిస్తున్నా.' అని తెలిపాడు.