T20 World Cup 2021: చెత్త పిచ్‌లు.. ఇంత దారుణమా? టాస్ గెలిచినోడిదే విజయమా?

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. పక్కా ప్లాన్‌తో పర్‌ఫెక్ట్ బౌలింగ్‌తో, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో, ఖతర్నాక్ బ్యాటింగ్‌తో కోహ్లీసేనను ఓడించిన న్యూజిలాండ్ సెమీస్ దిశగా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దాంతో భారత్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి.
హ్యాట్రిక్ విక్టరీలతో గ్రూప్2 టాపర్ పాకిస్థాన్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోగా.. పాయింట్ల ఖాతానే తెరవని భారత్(-1.61 రన్‌రేట్) ఐదో ప్లేస్‌లో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో చిన్న జట్టు అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై గెలిచినా మనోళ్లు సెమీస్ చేరడం కష్టమే. ఎందుకంటే ఈ మూడు టీమ్స్‌తోనే తలపడనున్న న్యూజిలాండ్ రెండింటిలో ఓడాలి, అది అసాధ్యమే అనొచ్చు. ఒక మ్యాచ్‌లో ఓడినా ప్లస్ రన్‌రేట్(0.76)తో కివీస్ ముందంజ వేసే చాన్సుంది. కాబట్టి భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే. అయితే ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న యూఏఈ పిచ్‌ల క్వాలిటీ అభిమానుల అసహనానికి గురిచేస్తోంది. టాస్ గెలిచిన జట్లనే విజయం వరించడం.. ఓడిన జట్లు కనీసం పోరాటం చేసే ఆస్కారం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

టాస్ గెలిస్తే గెలుపే..
యూఏఈలోని పిచ్‌లు మొదట బ్యాటింగ్‌కు కఠినంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట మ్యాచ్‌ల్లో అయితే మంచు ప్రభావం కారణంగా ఛేదన చేసే జట్టుకే ఎక్కువ విజయాలు దక్కుతున్నాయి. భారత్‌తో మ్యాచ్ కలిపి ఇప్పటివరకూ సూపర్ 12 దశలో.. రాత్రి పూట తొమ్మిది మ్యాచ్‌లకు గాను ఎనిమిదింట్లో ఛేదన చేసిన జట్లదే విజయం. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సులువుగా మారుతుండడంతో టాస్ గెలిచిన జట్లు మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌కే మొగ్గు చూపుతున్నాయి. బలమైన ఆస్ట్రేలియా కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో ఎలా తడబడిందో చూశాం. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అనే భావన ఏర్పడింది. అంతటి కీలకమైన టాస్‌ను భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి మూల్యం చెల్లించుకుంది.

7 మ్యాచ్‌లకు 7..
మరోవైపు పాకిస్థాన్ గెలిచిన మూడు విజయాల్లో రెండు సార్లు టాస్ గెలవగా.. మరో మ్యాచ్‌లో లక్కీగా ప్రత్యర్థి ఆహ్వానం మేరకు ముందుగానే ఫీల్డింగ్ చేసి విజయాన్నందుకుంది. న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్ చేతిలో టాస్ ఓడి మూల్యం చెల్లించుకోగా.. భారత్‌తో కీలక పోరులో గెలిచి విజయాన్నందుకుంది. ముఖ్యంగా దుబాయ్ మైదానంలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు జరగ్గా ఏడింటికి ఏడు చేజింగ్ చేసిన జట్లే విజయాన్నందుకున్నాయి. సూపర్ 12లో వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ విషయం స్పష్టమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 55 పరుగులకే కుప్పకూలింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో.

టాస్ కలిసి రాకపోవడంతో..
ఎంతటి బలమైన జట్టు అయినా టాస్ ఓడిందా.. ముందుగా బ్యాటింగ్ చేసిందా.. గెలవడం అసాధ్యం అనే భావన అందరికి వచ్చింది. నిన్నటి మ్యాచ్‌లోనూ టాస్ ఓడిన భారత ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టాస్ ఓడామే అనే బాధతోనే బ్యాటింగ్ చేసినట్లు అనిపించింది. ఏ క్రమంలోనూ విజయం కోసం తెగించి ఆడినట్లు కనిపించలేదు. ఈ వికెట్‌పై భారీ స్కోర్ చేయకపోతే కష్టమేననే ఆందోళన వారిలో కనిపించింది. మ్యాచ్ అనంతం కోహ్లీసైతం ఈ విషయాన్ని అంగీకరించాడు. బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. రక్షించుకునేంత స్కోర్ చేయలేదు కానీ.. కనీసం పోరాడలేకపోయామని తమ వైఫల్యాన్ని అంగీకరించాడు.

ఫ్యాన్స్ ఫైర్..
ఈ క్రమంలోనే ఐసీసీపై క్రికెట్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో ఇలాంటి నిర్జీవమైన పిచ్‌లు తయారు చేస్తారా? అని మండిపడుతున్నారు. హోరాహోరీ మ్యాచ్‌లను ఆశించిన అభిమానులకు ఈ వన్‌సైడ్ మ్యాచ్‌లతో క్రికెట్‌పై ఉన్న ఇష్టం సన్నగిల్లుతుందని, ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఊపిరి బిగపట్టేట్టూ జరగలేదని విమర్శిస్తున్నారు. ఇంతటి దారుణమైన పిచ్‌లపై మెగా టోర్నీని నిర్వహించడం బాలేదంటున్నారు. టాస్ గెలిచినోడిదే విజయమైనప్పుడు మ్యాచ్ ఆడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బీసీసీఐ.. ఐపీఎల్ పేరిట తాను తీసుకున్న గోయ్యిలో తానే పడిందని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications