T20 World Cup 2021: ఆట ఇక ‘సూపర్’.. విశ్వపోరులో విజేత ఎవరో?

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. ధనాధన్ క్రికెట్‌లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. గత వారమే ముగిసిన ఐపీఎల్ ఎప్పటిలాగే క్రికెట్ అభిమానులను అలరించగా.. ఇప్పుడు అంతకు మించిన వినోదాన్ని పంచేందుకు ఏకంగా 12 జట్లు రెడీ అయ్యాయి. ఏకంగా ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్ కోసం నువ్వా.. నేనా.. అనే రీతిలో సవాల్ విసిరేందుకు ఎదురుచూస్తున్నాయి.
గత 10 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఐసీసీ టైటిల్‌ను భారత్ ఈసారైనా అందుకుంటుందా? లేక వెస్టిండీస్ చాంపియన్ హోదాను నిలబెట్టుకుంటుందా? అటు ఆసీస్.. కివీస్ ఈసారైనా బోణీ కొడతాయా? వన్డే విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ అదే జోరును చూపిస్తుందా? సంచలన విజయాలతో పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు టైటిల్‌ను ఎగురేసుకుపోతాయా? అనేది వేచి చూడాల్సిందే.

కరోనా కారణంగా..
రెండేళ్లకోసారి అట్టహాసంగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ఈసారి ఐదేళ్ల విరామం తీసుకుంది. ఆలస్యానికి 2017 చాంపియన్స్ ట్రోఫీ ఒక కారణమైతే.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి మరో కారణం. 2016లో చివరిసారిగా భారత్‌లో జరిగిన ఈ టోర్నీలో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. తాజా టోర్నీ శనివారం నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈ వేదికగా జరగనుంది.
ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ టోర్నీ భారత్ వేదికగానే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా యూఏఈకి తరలించారు. ఐపీఎల్-2021 సీజన్ కూడా ఇక్కడే జరిగిన విషయం తెలిసిందే. ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ దగ్గరే ఉన్నాయి. దుబాయ్, షార్జా, అబుదాబిల్లో 33 మ్యాచ్‌లు జరుగుతాయి.

టోర్నీ సాగేదిలా..
ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది. ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట నేటి( శనివారం) నుంచి జరుగుతాయి. ఇందులో ఆరేసి జట్లతో రెండు గ్రూపులుండగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-8గా నిలిచిన జట్లు ఇప్పటికే చోటు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన నాలుగు జట్ల కోసం ఒమన్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరిగాయి.
వీటి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు స్కాట్లాండ్, నమీబియా జట్లు గ్రూప్ 1, గ్రూప్ 2లో చేరాయి. ఇక అసలు సమరంలో ఒక్కో గ్రూప్‌లోని ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో విజేతలు టైటిల్ కోసం నవంబరు 14న దుబాయ్ వేదికగా బరిలోకి దిగుతాయి.

ఫేవరెట్ భారత్
బరిలోకి దిగేది 12 జట్లయినా టైటిల్ ఫేవరెట్లలో మాత్రం కొన్ని జట్లే ఉన్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచక్‌పను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఇప్పటిదాకా మరో టోర్నీ దక్కకపోయినా ఈసారి మాత్రం జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. దీనికి తోడు ధోనీ మెంటార్‌గా టీమ్‌ను వెనకుండి నడిపించబోతున్నాడు.
ఇటీవలె ముగిసిన ఐపీఎల్‌తో ఆటగాళ్లంతా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్.. రోహిత్, విరాట్, రాహుల్, పంత్, బుమ్రాలాంటి మ్యాచ్ విన్నర్లతో ఊపు మీద కనిపిస్తోంది. 2016 మెగా టోర్నీ తర్వాత భారత్ ఈ ఫార్మాట్‌లో 72 మ్యాచ్‌లాడింది. 65.3 విజయాల శాతంతో 47 గెలుపులు, 22 ఓటములతో మెరుగ్గానే కనిపిస్తోంది. ఇక టీ20 ప్రపంచక్‌పలోనూ ఆడిన 33 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది.
అదీగాకుండా కోహ్లీ ఆధ్వర్యంలో భారత జట్టు చివరి టీ20 టోర్నీ ఆడబోతోంది. ధోనీ సైతం మరో టైటిల్ అందించాలనే ఆశతో ఉన్నాడు. ఈ కప్‌ను ఈ ఇద్దరికి కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో సహచర ఆటగాళ్లున్నారు.

నజరానా?
ప్రైజ్‌మనీ విజేతకు: రూ.12 కోట్లు
రన్నరప్‌కు: రూ. 6 కోట్లు
సెమీస్‌లో ఓడిన జట్లకు: చెరి 3 కోట్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications