T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్!

అల్ అమెరాట్: సొంతగడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్ జట్టు.. కీలక టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో మాత్రం చేతులెత్తేసింది. తమకంటే తక్కువ అనుభవం కలిగిన స్కాట్లాండ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్‌లో స్కాట్లాండ్‌తో తలపడిన బంగ్లాదేశ్ జట్టు సమష్టిగా విఫలమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. స్కాట్లాండ్ జట్టులో క్రిస్ గ్రీవ్స్ (45), మున్సే(29), మార్క్ వాట్(22) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మహేది హసన్ మూడు, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షకిబ్ తలో రెండు వికెట్లు తీశారు.

చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్
అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహిమ్(38) రాణించగా, షకిబ్ అల్ హసన్(20), మహ్మదుల్లా(23) ఫర్వాలేదనపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ వీల్ మూడు వికెట్లు, క్రిస్ గ్రీవ్స్ రెండు, జోష్ డేవి, మార్క్ వాట్ తలో వికెట్ తీశారు.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్కాట్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రిస్ గ్రీవ్స్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45; బౌలింగ్‌లో 2/19)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఇది కేవలం రెండో టీ20 మ్యాచ్‌కాగా రెండింటిలోనూ స్కాట్లాండే నెగ్గడం విశేషం. 2012లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది.

ఆదుకున్న గ్రీవ్స్
స్కాట్లాండ్ కెప్టెన్ కొయెట్జర్ (0) డకౌట్ కాగా, మున్సే (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూక్రాస్ (11) కాసేపు స్కోరు బోర్డును నడిపించారు. తర్వాత మెహిదీ హసన్, షకీబ్‌ల దెబ్బకు స్కాట్లాండ్ కుదేలైంది. 8 పరుగుల వ్యవధిలోనే క్రాస్, మున్సే, బెరింగ్టన్ (2), లిస్క్(0), మ్యాక్‌లియోడ్ (5) పెవిలియన్ చేరారు. 53 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన స్కాట్లాండ్‌ను క్రిస్ గ్రీవ్స్ ఆదుకున్నాడు. మార్క్ వాట్ (22; 2 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.

టాపార్డర్ వైఫల్యం
బంగ్లా టాపార్డర్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు లిటన్ దాస్ (5), సౌమ్య సర్కార్ (5), షకీబ్ (20) నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ముష్పికర్, మహ్మూదుల్లా (23; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. అయితే స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా స్కోరు వేగం పడిపోయింది. దీంతో తర్వాత క్రీజులోకి దిగిన బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడికి తలవంచి వికెట్లు పారేసుకున్నారు.

బౌలర్ల టాపర్ షకీబ్
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. స్కాట్లాండ్‌పై అతను 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా శ్రీలంక పేసర్ మలింగ పేరిట ఉన్న 107 వికెట్ల రికార్డును అధిగమించి 108 వికెట్లతో టాప్ ర్యాంక్‌లోకి వెళ్లాడు.
అంతకుముందు జరిగిన మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పపువా న్యూగినియాపై ఒమన్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు వికెట్ కోల్పోకుండా 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications