
అల్ అమెరట్: టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో స్కాట్లాండ్ టీమ్ జోరు కొనసాగుతోంది. వరుసగా ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పపువా న్యూ గినియాతో మంగళవారం జరిగిన గ్రూఫ్ బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన స్కాట్లాండ్ 17 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. రిచీ బెర్రింగ్టన్(49 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ క్రాస్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా(4/31) నాలుగు వికెట్లు తీయగా.. చద్ సోపర్(3/24) మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. నార్మన్ వనూహ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన స్కాట్లాండ్ బ్యాట్స్‌మన్ రిచీ బెర్రింగ్టన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ తరపున అర్థ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
స్కాట్లాండ్ దేశంలోని చిన్నారులు మొత్తంగా తమ జట్టు కోసం 200 జెర్సీలు రూపొందించారు. అందులో హడింగ్టన్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి రెబెకా డౌనీ రూపొందించిన జెర్సీని ఆ జట్టు ఆటగాళ్లు సెలెక్ట్ చేశారు. స్కాట్లాండ్ దేశ చిహ్నం రంగులో ఈ జెర్సీని రూపొందించింది రెబెకా. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ను కుటుంబంతో సహా ప్రత్యక్షంగా వీక్షించింది రెబెకా.
'జెర్సీ రూపొందించే పోటీల్లో నేను గెలిచానని తెలియగానే చాలా ఆనందంగా అనిపించింది. ముందు ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయా. మా దేశ ఆటగాళ్లు నేను రూపొందించిన జెర్సీని వేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. స్కాట్లాండ్ జట్టును ప్రత్యక్షంగా కలిసే అద్భుత అవకాశం నాకు దక్కింది. జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో వారిని కలిశాను. వారు ఆడే ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నా."అని ఆ చిన్నారి పేర్కొంది.