
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయని హార్దిక్ పాండ్యాను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌లో బౌలింగ్ చేయని హార్దిక్ పాండ్యాను భారత సెలెక్టర్లు పక్కనపెట్టాలని భావించారంట.. కానీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోనీనే పట్టుపట్టి మరీ అతన్ని జట్టులో ఉండేలా చేశాడంట. ఫినిషర్‌గా పాండ్యా జట్టులో ఉండటం కీలకమని మహీ సూచించడంతో సెలెక్టర్లు అతన్ని కొనసాగించారని టైమ్స్ ఇండియా పేర్కొంది.
వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్ ముంగిట భారత్ జట్టులోకి సడన్‌గా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ను భారత సెలెక్టర్లు చేర్చారు. అతని కోసం స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ని ప్రధాన జట్టులో నుంచి తప్పించి.. స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో చేర్చారు. నిజానికి అక్కడ అక్షర్ పటేల్ స్థానంలో హార్దిక్ పాండ్యాని జట్టులోని నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావించారట. ఐపీఎల్ ముగిసిన వెంటనే యూఏఈ నుంచి పాండ్యాను ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారంట. కానీ.. ధోనీ ఎంట్రీ ఇచ్చి.. హార్దిక్ పాండ్యా ఫినిషర్‌గా టీ20 వరల్డ్‌కప్‌లో జట్టుకి ఉపయోగపడతాడని చెప్పినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. దాంతో అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టి శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారని చెప్పాడు.
గత ఏడాదికాలంగా శార్ధూల్ ఠాకూర్ ఆల్‌రౌండర్‌గా అన్ని ఫార్మాట్లలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. 2019లో వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి బౌలింగ్‌కి దూరంగా ఉంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అడపాదడపా బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత అతను మళ్లీ బంతి అందుకోలేదు. టీ20 ప్రపంచకప్ ముందు జరిగిన శ్రీలంక పర్యటనలో, ఐపీఎల్‌లో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.
పాకిస్థాన్‌తో గత ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచ్‌లోనే టీమిండియా చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఫినిషర్‌గా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. అలానే అతను బౌలింగ్ కూడా చేయకపోవడంతో సిక్త్స్ బౌలింగ్ ఆప్షన్ లేక టీమిండియాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఫామ్‌లో లేని అతనికి బదులు ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచిస్తున్నారు.
అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం హార్దిక్ ముమ్మురంగా సిద్దమవుతున్నాడు. మహీ పర్యవేక్షణలో అతను నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలింగ్ చేసేందుకు హార్దిక్ సిద్దమైనట్లు తెలుస్తోంది.