T20 World Cup 2021: పాక్ చేతిలో ఓడినా.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే కోహ్లీసేనదే టైటిల్!

హైదరాబాద్: ఎక్కడా జరిగినా.. ఎప్పుడు జరిగినా.. ఎలా జరిగినా.. ఐసీసీ ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌పై భారతే గెలుస్తుంది. ఇది చరిత్ర.. 1975 నుంచి మొదలుపెడితే 2016 వరకు 12 మ్యాచ్‌లు ఆడితే అన్ని విజయాలు ఇండియావే.. ఇది రికార్డు..! కానీ ఈసారి హిస్టరీ రిపీట్ కాలేదు.. రికార్డు కొనసాగలేదు.! యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆతృతతో, ఆసక్తితో ఎదురుచూసిన అరుదైన పోరులో టీమిండియా అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా.. ఏనాడూ ఆడని రకంగా.. చరిత్రకు పూర్తి భిన్నంగా.. పాక్ బౌలర్ల ముందు టీమిండియా మొనగాళ్లు బ్యాట్లు ఎత్తేశారు. ఇక బౌలర్లు కూడా పరుగుల గేట్లు తెరిచేయడంతో.. ఓ లో స్కోరింగ్ మ్యాచ్‌లో అపురూప విజయాన్ని అందుకున్న పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది.

ఓపెనర్ల సింగిల్ డిజిట్..
అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. ఓ సెంటిమెంట్ అభిమానుల్లో టైటిల్ ఆశలను రేకిత్తిస్తోంది. అదేంటంటే.. పాకిస్థాన్‌పై జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సింగిల్ డిజిట్‌కు ప్రతీసారి భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. తాజా మ్యాచ్‌లో షాహిన్ షా అఫ్రిది ధాటికి రోహిత్ శర్మ(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. కేఎల్ రాహుల్(8 బంతుల్లో 3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే వీరి వైఫల్యమే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలుస్తుందనేదానికి సంకేతమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

2007 టీ20 ప్రపంచకప్‌లోనూ..
2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ లీగ్ దశలో పాకిస్థాన్‌పై ఓపెనర్లుగా బరిలోకి దిగిన వీరేంద్ర సెహ్వాగ్ (5), గౌతమ్ గంభీర్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత్ బౌల్ ఔట్ పద్దతిని గెలిచింది. ఆ తర్వాత ఆ టోర్నీలో ఫైనల్‌కి చేరిన టీమిండియా.. తుది పోరులో మళ్లీ పాకిస్థాన్‌ని ఓడించి మరీ విజేతగా అవతరించింది. ఇక 2016 ఆసియా కప్‌లోనూ ఇదే తరహాలో పాకిస్థాన్‌పై ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, అజింక్య రహానే డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ టోర్నీలోనూ టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో.. పాక్‌పై గ్రూప్ దశ మ్యాచ్‌లో ఓపెనర్లు సింగిల్ డిజిట్‌కి ఔటైతే.. ఆ టోర్నీలో భారత్ జట్టు విజేతగా నిలుస్తోంది. కాబట్టి.. టీ20 వరల్డ్‌కప్ 2021 కూడా టీమిండియాదేనని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు.

ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే..
ఇక ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో టీమిండియా టోర్నీలో ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. న్యూజిలాండ్‌తో జరిగే తమ తదుపరి మ్యాచ్‌తో పాటు అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా టీమ్స్‌తోనూ గెలవాలి. అప్పుడే సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే విఫలమైన ప్రతీసారి నేలకు కొట్టిన బంతిలా భారత్ గొప్పగా పుంజుకోవడం ఇటీవల చూశాం. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటై అందరి చేత విమర్శలు ఎదుర్కొన్న భారత్.. ఆ తర్వాత వరుస విజయాలతో సిరీస్‌నే కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఆసీస్‌ను మట్టికరిపించింది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో డబ్యూటీసీ ఫైనల్ కోల్పోవడంతో పాటు ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్ ఓడిన భారత్ ఆ తర్వాత.. దుమ్మురేపి 2-1తో లీడ్‌లో నిలిచింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీలోనూ అదే తరహా పెర్ఫామెన్స్‌ను టీమిండియా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

టాస్ ఓడిపోవడంతో..
పాక్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడటం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. మంచు ప్రభావం ఉండటంతో తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' షాహిన్ అఫ్రిది (3/31) దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును గెలిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications