
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. పక్కా ప్లాన్‌తో పర్‌ఫెక్ట్ బౌలింగ్‌తో, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో, ఖతర్నాక్ బ్యాటింగ్‌తో కోహ్లీసేనను ఓడించిన న్యూజిలాండ్ సెమీస్ దిశగా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దాంతో భారత్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. ఎంత చెత్త బ్యాటింగ్ అంటే.. ఆడుతుంది మనోళ్లేనా? అని ప్రతీ భారత అభిమానికి సందేహం కలిగింది. వరల్డ్ క్లాస్ బ్యాటర్లంతా కలిసి చేసింది 110 పరుగులే. 6 నుంచి 17 ఓవర్ల మధ్య వరుసగా 70 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాలేదంటే మన బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన బ్యాటర్లు సింగిల్స్‌కే ఇబ్బంది పడ్డ పిచ్‌పై కివీస్ చెలరేగింది.
భారత్ ఇచ్చిన టార్గెట్‌ను రెండే వికెట్లు కోల్పోయి మరో 33 బంతులు మిగిలుండగానే చేధించిందంటే మన బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో చెప్పొచ్చు. మొత్తానికి వారం కిందట పాకిస్థాన్ చేతిలో చావు దెబ్బ నుంచి పాఠాలు నేర్చుకొని కోహ్లీసేన మరోసారి ఆల్‌రౌండ్ ఫ్లాప్ షో చేసింది. దాంతో తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వచ్చేందుకు సిద్దమైంది. ఈ పరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరాలనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ లెక్కల ప్రకారం ఓ 20 శాతం అవకాశం ఉంది.
భారత జట్టు ఉన్న గ్రూప్-2లో హ్యాట్రిక్ విజయాలతో టాప్‌లో నిలిచిన పాకిస్థాన్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మిగిలిన ఒక బెర్త్ కోసం అప్గానిస్థాన్, న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. అఫ్గాన్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలవగా.. న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచింది. అయితే అఫ్గాన్.. నమీబియా, స్కాట్లాండ్‌పై భారీ తేడాతో గెలిచి 3.097 మెరుగైన రన్‌రేట్‌లో టాప్2లో ఉండగా.. న్యూజిలాండ్ 0.722 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత నమీబియా(-1.287), భారత్(-1.609), స్కాట్లాండ్(-3.562)వరుసగా ఉన్నాయి.
భారత్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే.. తమ తదుపరి మ్యాచ్ మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయాలందుకోవాలి. నవంబర్ 3న అఫ్గానిస్థాన్, నవంబర్ 5న స్కాట్లాండ్, 8న నమీబియాలను మట్టికరిపించాలి. గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. అప్పుడు భారత్ ఖాతాలో 6 పాయింట్లు చేరుతాయి. అంతేకాకుండా న్యూజిలండ్‌ను భారీ తేడాతో అఫ్గానిస్థాన్ ఓడించాలి. ఆ తర్వాత నమీబియా లేదా స్కాట్లాండ్ చేతిలో కివీస్ చిత్తవ్వాలి.
అఫ్గాన్ చేతిలో ఓడినా రన్‌రేట్ తక్కువగా ఉండాలి. అప్పుడు భారత్, న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఆ సమయంలో నెట్ రన్‌రేట్ కూడా కీలకంకానుంది. అప్పుడు అఫ్గాన్ సైతం రేసులో ఉంటుంది. ఆ జట్టు రన్‌రేట్ కూడా తక్కువగా ఉంటే భారత్‌కు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరగం అసంభవం. అద్భుతం జరిగితే తప్పా భారత్ సెమీస్ చేరదనేది వాస్తవం. అంతేకాకుండా భారత ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అఫ్గాన్ చేతిలో ఓడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి భారత్ సెమీస్ ఆశలు గల్లంతయినట్లే.