T20 World Cup 2021లో ఆడటం ఆశమాషి కాదు.. ధోనీ అనుభవం జట్టుకు కలిసొస్తుంది: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో ఆడటం సులువైన పనికాదని, మెంటార్‌గా ఎంతో అనుభవం కలిగిన మహేంద్ర సింగ్ ధోనీ ఉండటం జట్టుకు కలిసొస్తుందని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ధోనీ అనుభవం ఉపయోగపడుతుందన్నాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టోర్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్.. ధోనీని మెంటార్‌గా నియమించి మంచి పనిచేశారన్నాడు. 'తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యువ ఆటగాళ్లతో ధోనీ తన అనుభవాన్ని పంచుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచకప్ ఆడటం అంత సులువైన పనికాదు. మెగా టోర్నీ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి అనుభవం కలిగిన ఆటగాడు జట్టులో ఉండటం ముఖ్యం. ధోనీ ఖచ్చితంగా తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకుంటాడు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టీ20 ప్రపంచకప్ సాధిస్తే చిరస్థాయిగా నిలిచిపోతుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా పొట్టి ప్రపంచకప్ సాధించి 14 ఏళ్లు గడిచిందని, కోహ్లీ కోసం కాకుండా ఈ లోటు తీర్చేందుకైనా టైటిల్ అందుకోవాలన్నాడు. 'ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలనే పట్టుదలతో కోహ్లీ ఉంటాడు. మిగతా ఆటగాళ్లందరూ అందుకోసమే ఎదురుచూస్తుంటారని కూడా నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచి ఇప్పటికే 14 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో చాలా కాలంగా మనం ఎదురుచూస్తునే ఉన్నాం. ఇక్కడ కోహ్లీ చివరిసారి టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్సీ చేస్తున్నాడనే కారణంతో గెలవకపోయినా భారత్ గెలిచి తీరాలి. అది అతని సారథ్యంలో నెరవేరితే మరీ మంచిది' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ధోనీ సారథ్యంలో టీమిండియా 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సైతం ధోనీ సారథ్యంలోనే భారత్ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ ప్రపంచకప్ గెలవలేదు. 2014 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరినా.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. ఇక 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌తో పాటు ఈ ఏడాది 2021 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ భారత్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన ఎలాగైనా ఈసారి కప్పు గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications